19 June, 2026 | 3:12 AM

తిరుమల శ్రీవారి సేవలో మాజీ మంత్రి పువ్వాడ

19-06-2026 12:30 AM

ఖమ్మం, జూన్ 18 (విజయక్రాంతి): తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తెలంగాణ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం మీడియాతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాయని అన్నారు. ఇతర విషయాల్లో కూడా తెలుగు ప్రజలు భావోద్వేగాలకు లోను కాకుండా కలిసిమెలిసి ప్రగతి సాధించేలా స్వామివారి ఆశీస్సులు ఉంటాయని విశ్వసించారు. టీ.టీ.డీ ఆధ్వర్యంలో తిరుమలలో ఆలయ అభివృద్ధి చాలా బాగా జరుగుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.

ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ పక్ష నేతగా ఉన్నప్పటి నుండి 30 ఏళ్లుగా తిరుమలను దర్శించేవారని స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణలో వేంకటేశ్వర స్వామి వారి భక్తులు అనేకమంది ఉన్నారని ప్రతి ఊరిలో శ్రీవారి ఆలయాలు అనేకం ఉన్నాయని శ్రీ వేంకటేశ్వర స్వామి తెలుగు రాష్ట్రాల ప్రజలను చల్లగా దీవించాలని, ఎల్ నినో విపత్తు ప్రభావం నుంచి రైతులకు ఉపశమనం కలిగించేలా వర్షాలు సమృద్ధిగా కురవాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి పేర్కొన్నారు.