19 June, 2026 | 1:42 AM

ఎవరికీ పట్టని కౌలు రైతు

19-06-2026 12:36 AM
  1. కౌలు రైతు కష్టాలు
  2. కౌలు రైతుకు ప్రభుత్వ పథకాలు చేరడం లేదు.
  3. రైతు బంధు పథకం వర్తించడం లేదు
  4. పంట సాగు చేసినా.. లోన్లు ఇవ్వని బ్యాంకులు

బోధన్, జూన్18 (విజయక్రాంతి): ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. సొంత భూమి లేక.. కూలీగా మిగలలేక ఆసాముల దగ్గర భూమి కౌలుకు తీసుకుంటున్న కౌలు రైతుకు ప్రభుత్వ పథకాలు చేరడం లేదు. పె ట్టుబడికి బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడంతో దళారీల దగ్గర అధిక వడ్డీలకు అప్పు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు పథకం వర్తించడం లేదు. రైతు బీమాకు దూరంగానే ఉంటున్నారు. బోధన్ డివిజన్ లోని బోధన్, ఎడపల్లి, రెంజల్, నవిపెట్, సాలూర, వర్ని, రుద్రూర్,చందుర్, మండలాలు ఉన్నాయి. 

రైతు బంధు, బీమాకు దూరం

పంట సాగు చేసినా.. లోన్లు ఇవ్వని బ్యాంకులు బోధన్,నవీపేట్, రుద్రూర్, వర్ని, చందూర్, కోటగిరి, మోస్రా మండలాల వ్యాప్తంగా 26 వేల కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు పెద్ద ఆసాముల వద్ద భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. పంట పండినా, పండకపోయినా కౌలు మాత్రం తప్పనిసరిగా చెల్లించాల్సిందే. ప్రకృతి వైపరీత్యాలు, నీటి కరువు రైతులను ఎప్పుడు భయపెడుతూనే ఉంటాయి. ఇవి అందరు రైతులకు ఇబ్బందికరమైన అంశామే అయినా.. కౌలు రైతులను మాత్రం మరింత కుంగదీస్తాయి. ఆరుగాలం కష్టపడి పంట పండించినా సరైన ధర పడుతుందన్న నమ్మకం లేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టు బడి సాయం, ఇతర పథకాలు కింద సబ్సిడీ యంత్రాలు అందిస్తున్న కౌలు రైతులను మాత్రం గాలికొదిలేశాయి. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేశారు. వాటి ఆధారంగా కొందరికి పంట పెట్టుబడి కోసం లోన్లు మంజూరు చేశారు. కానీ దీనిని పట్టాదా రులు వ్యతిరేకించారు. దీంతో ఈ ప్రక్రియ అక్కడే ఆగిపోయింది.

ఆ తరువాత ఈ విషయంపై చర్చించిన దాఖలాలు లేవు. ఒకేసారి కౌలు మొత్తం చెల్లించాలి పంట సాగు చేయడానికి ముందే కౌలు రైతు భూయజమానికి ఒకే సారి మొత్తం డబ్బులు చె ల్లించాలి. పంటలు దిగుబడి వచ్చినా, రాకున్నా యజమానికి సంబంధం ఉండదు. ఏడాదికి వర్షాధారిత భూములకు గతంలో ఎకరాకు రూ. 6 వేలు, సాగునీటి సౌకర్యం ఉన్న భూములకు రూ. 10 వేల కౌలు ఉండేది. ప్రస్తుతం వర్షాధార భూములకు రూ.18 వేలు సాగునీటి సౌకర్యం ఉన్న వాటికి రూ.35 వేల వరకు కౌలు వసూలు చేస్తున్నారు. 

కౌలు రైతులకు పెట్టుబడి ఇవ్వాలి. 

ప్రభుత్వం కౌలు రైతులకు సైతం రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలి. అలా చేస్తేనే కౌలు రైతు ఆర్థికంగా నిలదొక్కుకుంటాడు. అప్పులు చేసి పంట సాగు చేసినా.. సరైన గిట్టుబాటు ధర రావడం లేదు.

- సిద్దాపూర్ భూమయ్య బోధన్, కౌలు రైతు