రేవంత్ రెడ్డికి ఈద్ కా జవాబ్.. పత్తర్ సే దేనా
గుడితో పాటు లింగాన్ని మింగేలా రేవంత్ పాలన
రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
పటాన్చెరు, జూలై 12: సీఎం రేవంత్ రెడ్డికి ఈద్ కా జవాబ్ పత్తర్ సే దేనా...రాబోయే ఎన్నికల్లో 117 సీట్లు గెలవడం కాదు 9 సీట్లకే పరిమితం అవుతారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్, సర్ పై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రజల్లో మార్పు చూస్తుంటే మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందని, స్కామ్ ల ప్రభుత్వం పోయి స్కీంల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, రాష్టాల్లో సర్ ప్రక్రియతో ఓట్లు గోల్ మాల్ అయ్యి ఫలితాలు మారాయని చెప్పారు. పటాన్ చెరు గడ్డ బీఆర్‌ఎస్ అడ్డా అని, మున్సిపల్ ఎన్నికల్లో ఐదింటికి ఐదు చైర్మన్ సీట్లు గెలిచామన్నారు. రేవంత్ రెడ్డి 30 వేల కోట్ల రూపాయల భూములను అమ్మాడని, బీఆర్‌ఎస్ హయాంలో పెట్టిన పథకాలను పక్కన పెట్టారని విమర్శించారు.
కళ్యాణాలక్ష్మి చెక్కు పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత వస్తుందని, అందాల పోటీలు, బోధి భవన్ కి వందల కోట్లు ఖర్చు చేశారని, రాహుల్ గాంధీకి డబ్బులు పంపడానికి, పక్క రాష్ట్రాల్లో యాడ్ లు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి గానీ పేదల పథకాలకు మాత్రం డబ్బులుండవా అంటూ ప్రశ్నించారు. ఔరంగజేబు జుట్టుకు టాక్స్ కట్టినట్టు...రేవంత్ భూమికి శిస్తు పెడతాడని చెప్పారు. సిగాచి ప్రమాదంలో 54 మంది చనిపోతే రేవంత్ ఒక్క రూపాయి ఇవ్వలేదని, కంపెనీ వాళ్లే బాధిత కుటుంబాలకు డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు.
పటాన్ చెరులో ఐటీ పార్కు కోసం భూమి కేటాయిస్తే దాన్ని రేవంత్ అమ్మేశాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలన గుడిని.. గుడిలో లింగాన్ని మింగేట్టట్టు ఉందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తామని, సీట్లు పెరిగినా అవికూడా గెలుస్తామన్నారు. రేవంత్రెడ్డి 117 సీట్లు గెలుస్తామని గొప్పలు చెబుతున్నాడని, మొత్తం కలిపితే 9 సీట్లకంటే ఎక్కువ గెలవలేరని హరీష్రావు ఎద్దేవా చేశారు. అనంతరం సర్ ప్రక్రియపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






