నల్లమల్ల పులి బిడ్డ కాదు.. పిల్లిపిల్ల
పగటి కలలు కంటూనే ఉండాలి రేవంత్‌రెడ్డి
పాలమూరుకు అన్యాయం చేసింది కాంగ్రెస్
మాజీ మంత్రి హరీశ్‌రావు
వనపర్తి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): పొద్దున లేస్తే నల్లమల్ల పులి బిడ్డ అని చెప్పుకోవడం తప్ప పాలమూరుకు చేసింది ఏమి లేదని నల్లమల్ల పులి బిడ్డ కాదు పిల్లి పిల్ల అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. వనపర్తి జిల్లా ఎదుల మండలం గొల్లపల్లి వద్ద నిర్మించనున్న గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం వద్దుంటూ 102 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షకు మద్దతు తెలుపుతూ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
102 రోజులుగా దీక్ష చేస్తున్న మీ దీక్షకు భరోసా ఇస్తూ విరమణ చేయండి అని నిమ్మరసం ఇచ్చి విరమింప చేసి మీ పక్షాన ప్రభుత్వంతో పోరాడుతామన్నారు. పాలమూ రు జిల్లాను అన్యాయం చేసింది, పాలమూరు బిడ్డలు పనులు లేక ముంబై, దుబాయ్ వలసలకు వెళ్లేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమ న్నారు.70 ఏండ్ల కాలంలో కేఎల్‌ఐ, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులను 20 ఏండ్లుగా పెం డింగ్ పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. తెలంగాణ వచ్చాక పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ పరుగులు పెట్టించారన్నారు.కరోనాతో ఇబ్బంది ఉన్న తమ ప్రభుత్వ హయాంలో ఏనాడూ సంక్షేమ పథకాలు ఆపలేదని ఆయన వివరించారు. నడిగడ్డ ప్రాంతమైన అలంపూర్ నియోజకవర్గంలో తొమ్మిది నెలలో తుమల్లా ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లను అందించామన్నారు.
70 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలా లు 25 టీఎంసీలు ఇస్తే తెలంగాణ వచ్చాక తమ ప్రభుత్వ హయాం 9 ఏండ్లలో 40 టీఎంసీలు నీళ్లు అందించామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు జరగకుండా కోర్టులో కేసులు వేశారని, అయినా ఎక్కడ తగ్గకుండా కాళేశ్వరం మీద డబ్బులు తెచ్చి 11 వేల కోట్లు తెచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేశామని అది కేసీఆర్‌కు పాలమూరు మీద ఉన్న ప్రేమ అని ఆయన వివరించారు.
కేఎల్‌ఐలో వనపర్తి నియోజకవర్గం లేదని కేసీఆర్‌ను ఒప్పించి నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గం లోని లక్ష ఎకరాలకు నీళ్లు తెచ్చాడన్నారు. పాలమూరు బిడ్డల మీద అంత ప్రేమ ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను వెంటనే పూర్తి చేయాలనీ అయన డిమాండ్ చేశారు. శ్రీశైలం నీటి వాటా ఉన్న మనం వాడుకోలేని స్థితిలో ఆనాటి పాలనలో ఉండేదని కానీ తమ ప్రభుత్వం హయాంలో బరాబర్ నీటి వాటా గుంజుతం అని పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామ న్నారు.
మీకు మద్దతుగా ఉంటాం: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
గొల్ల పల్లి చీర్కపల్లి రిజర్వాయర్ వద్దు అని ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు వినతిపత్రంను అందచేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు.నీటి పారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు పని చేస్తున్న సమయంలో తనతో కలిసి తాను 60 నుంచి 70 సార్లు ప్రాజెక్టు పర్యటనలు చేసి మనకు 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచామన్నారు.
నీళ్లను కేఎల్‌ఐ ద్వారా ఎట్లా సాధ్యమని అని కొత్త రిజర్వాయర్ నిర్మించేందుకు ఆదేశాలు జారీ చేశారు.అప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రూపకల్పన ప్రారంభమైందని, అంతకు ముందు గొల్ల పల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన పెట్టడం వాస్తవమన్నారు. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగంగా ఎదుల రిజర్వాయర్ ఉంది.. అందులో నుంచి తూము పెట్టి నీళ్లు అందించవచ్చు అని గొల్ల పల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతపాదన 2016 లో రిజెక్ట్ చేసిందని ఆయన వివరించారు.
కమీషన్ల కోసం రిజర్వాయర్ నిర్మాణం: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పక్కన ఎదుల రిజర్వాయర్ ఉండగా మల్లి గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ వద్దు అని ఇక్కడి రైతులు పట్టుదలతో 102 రోజులు దీక్షలు చేస్తుంటే కేవలం కమీషన్ల కోసమే రిజర్వాయర్ కట్టి తీరుతామని ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సమావేశంలో ఎమ్మెల్యే విజేయుడు, మాజీ మంత్రి లక్ష్మా రెడ్డీ, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, బీరం హర్ష వర్ధన్ రెడ్డీ, చిట్టెం రాంమోహన్ రెడ్డీ, రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి బాస్ హనుమంత్ నాయుడు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.




