31 August, 2026 | 7:34 PM

ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువుల బుకింగ్

31-08-2026 06:48 PM

- సెప్టెంబర్ 1 నుంచి జిల్లాలో అమలు 

- రైతులు సద్వినియోగం చేసుకోవాలి

- జిల్లా వ్యవసాయాధికారిణి సురేఖ 

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ (Framework for Fertilizer Sale) యాప్ ద్వారా అన్ని రకాల ఎరువుల బుకింగ్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిణి సురేఖ(District Agriculture Officer Surekha) సోమవారం కోరారు. రైతులకు ఎరువుల బుకింగ్ ను మరింత సులభతరం చేసి, పారదర్శకంగా ఎరువులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన Framework for Fertilizer Sale (FFS) App ద్వారా ఇకపై అన్ని రకాల ఎరువులను ముందుస్తుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. 

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న Fertilizer Booking App ద్వారా ప్రధానంగా యూరియాను బుక్ చేసుకునే అవకాశం ఉండేదని, ఈ యాప్ ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ Fertilizer Booking App స్థానంలో కేంద్ర ప్రభుత్వ FFS App ను ఉపయోగించి మాత్రమే రైతులు ఎరువులను బుక్ చేసుకోవాలన్నారు. FFS App ద్వారా యూరియాతో పాటు DAP, MOP, NPK తో పాటు ఇతర సబ్సిడీ ఎరువులను రైతులు తమ అవసరానికి అనుగుణంగా బుక్ చేసుకుని పొందవచ్చునని సూచించారు.

రైతులు FFS Appలో తమ వివరాలను నమోదు చేసుకుని, అవసరమైన ఎరువుల రకం, పరిమాణాన్ని ఎంపిక చేసి, సమీపంలోని ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఎంచుకుని బుకింగ్ చేసుకోవచ్చునని, బుకింగ్ అనంతరం లభించే QR Code ఆధారంగా ఎంపిక చేసిన విక్రయ కేంద్రం నుంచి ఎరువులను పొందవచ్చునన్నారు. మంచిర్యాల జిల్లాలోని రైతులు ఈ FFS Appను వినియోగించి అన్ని రకాల ఎరువులను బుక్ చేసుకుని, సకాలంలో ఎరువులు పొందాలని కోరారు. రైతులకు FFS App వినియోగంపై ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO) లేదా మండల వ్యవసాయ అధికారు(AO)లను సంప్రదించాలని రైతులకు సూచించారు.