31 August, 2026 | 7:20 PM

లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో సాధించాలి

31-08-2026 06:13 PM

ప్రతి అభ్యర్థి ఉద్యోగం సాధించేలా కృషి చేయాలి

 జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల భర్తీలో పెద్దపల్లి జిల్లా అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అభ్యర్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో నిరంతరం శ్రమిస్తే అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా సాధించవచ్చన్నారు. 

సోమవారం కరీంనగర్‌లోని రేకుర్తి సమీపంలోని కిమ్స్ పీజీ కళాశాలలో పెద్దపల్లి జిల్లా అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్న యువశక్తి పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ తరగతులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ప్రత్యేకంగా మాట్లాడి, శిక్షణ విధానం, బోధన, వసతి, భోజనం తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అభ్యర్థి జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, దానిని చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కల్పిస్తున్న ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగ సాధన దిశగా అడుగులు వేయాలని తెలిపారు.

ప్రతి రోజును విలువైనదిగా భావించాలి

శిక్షణ కాలంలో ప్రతి రోజును అత్యంత విలువైనదిగా భావించి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పోటీ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావడంతో పాటు చదువుపై పూర్తి ఏకాగ్రత పెట్టాలని అన్నారు. చదువుతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని, నిరంతర సాధనతో పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదవాలి. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రతి అభ్యర్థి ఉద్యోగం సాధించేలా కృషి చేయాలి” అని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.

నాణ్యమైన సదుపాయాలు కల్పించాలి

శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను సమర్థవంతంగా అందించాలని సంబంధిత అధికారులు, శిక్షణ నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి, భోజనం, బోధన తదితర అంశాల్లో నాణ్యతను పాటించాలని సూచించారు.

యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక కావడానికి అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని ప్రతి అభ్యర్థి సద్వినియోగం చేసుకొని, ఉద్యోగాలు సాధించి పెద్దపల్లి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పెద్దపల్లి జిల్లా అభ్యర్థుల కోసం కరీంనగర్‌లోని శౌర్య డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణలో భాగంగా అభ్యర్థులకు ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయాలతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నాణ్యమైన శిక్షణ అందిస్తున్నారు.

జూలై 27, 2026న ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమం మొత్తం 100 రోజుల పాటు కొనసాగనుంది. యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షలకు అభ్యర్థులను సమర్థవంతంగా సన్నద్ధం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 100 మంది బాలికలు, 150 మంది బాలురు కలిపి మొత్తం 250 మంది అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు.