అభివృద్ధిలో కరీంనగర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: బండి సంజయ్
కరీంనగర్ క్రైమ్ఆగస్టు31 (విజయశాంతి): మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో గల్లీగల్లీలోనూ నూతనంగా రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నందున కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మోడల్ రోడ్లు, స్కై వాక్, జంక్షన్ల అభివ్రుద్ధి, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, వాటర్ డ్రెయిన్స్ నిర్మాణం వంటి వాటితోతోపాటు అభివ్రుద్ధిలో కరీంనగర్ ను తెలుగు రాష్ట్రాల్లోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం గత ఏడేళ్లలో రూ.22 వేల కోట్లకుపైగా నిధులను ఖర్చు చేసినట్లు వివరించారు.
ఈరోజు ఉదయం కరీంనగర్ లోని 45వ డివిజన్ మంకమ్మతోట ఎమ్మెల్సీ గోపాల్ రావు బిల్డింగ్ సమీపంలో రూ.70 లక్షల యూఐడీఎఫ్ నిధుల అంచనా వ్యయంతో డ్రెయిన్ పైప్ లైన్, సీసీ రోడ్డు పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిసనర్ ప్రపుల్ దేశాయ్, స్థానిక కార్పొరేటర్లు, పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
రూ.80 కోట్లతో డంపింగ్ యార్డ్ శాశ్వత పరిష్కారానికి సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రతిపాదనలు రూపొందించినం. నగరంలో ఉత్పత్తయ్యే చెత్తను సేకరించి ప్రాసెసింగ్ కేంద్రంలో వేరు చేసి, రీసైకిల్ చేసి శాస్త్రీయంగా పారవేయడం కోసం “ఘన వ్యర్థాల సమగ్ర నిర్వహణ ప్రాజెక్టు – బదిలీ కేంద్రం, ప్రాసెసింగ్ యూనిట్” ను ఏర్పాటు చేయబోతున్నాం. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని కరీంనగర్ అభివ్రుద్దే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అందుకోసం ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరుతున్నా.






