5 August, 2026 | 1:43 AM

ఇథియోపియా పోలీసులకు చైతన్య వర్సిటీలో ఫోరెన్సిక్ శిక్షణ

05-08-2026 12:56 AM

12 రోజుల అంతర్జాతీయ కార్యక్రమం విజయవంతం

మొయినాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్లో ఉన్న చైతన్య (డీమ్డ్ టు బి) విశ్వవిద్యాలయం ఫోరెన్సిక్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఇథియోపియా పోలీసు అధికారుల కోసం 12 రోజుల అంతర్జాతీయ ఫోరెన్సిక్ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఇథియోపియాలోని ఒరోమియా పోలీస్ కళాశాల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాస్త్రీయ నేర దర్యాప్తు పద్ధతులపై పోలీసు అధికారులకు శిక్షణ అందించారు.

చైతన్య విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు, ఛాన్సలర్ డాక్టర్ సీహెచ్.వి. పురుషోత్తం రెడ్డి, ప్రధాన పరిపాలనాధికారి డాక్టర్ సీహెచ్. సాత్విక రెడ్డి, ఒరోమియా పోలీస్ కళాశాల అసిస్టెంట్ కమిషనర్, జనరల్ డైరెక్టర్ గోసయే కెబెడెలే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

శిక్షణలో నేరస్థల పరిశీలన, వేలిముద్రల గుర్తింపు, డిజిటల్, మొబైల్ ఫోరెన్సిక్స్, ఫోరెన్సిక్ రసాయన శాస్త్రం, బాలిస్టిక్స్, పేలుడు పదార్థాల గుర్తింపు, ఫోరెన్సిక్ ఫోటోగ్రఫీ, నేర ప్రవర్తన విశ్లేషణ తదితర అంశాలపై సైద్ధాంతిక, ప్రాయోగిక శిక్షణ అందించారు.  ఫోరెన్సిక్ సైన్స్ విభాగ అధ్యాపకులు ధరావత్ అశోక్, బి. శివప్రసాద్, పి.ఎస్. పద్మ ప్రణవి, రేవతి సుందరమూర్తి శిక్షణ నిర్వహించారు. ఫోరెన్సిక్ సైన్స్లో అంతర్జాతీయ సహకారం, నైపుణ్యాభివృద్ధికి ఈ కార్యక్రమం మరో మైలురాయిగా నిలిచిందని విశ్వవిద్యాలయ ప్రతినిధులు తెలిపారు.