5 August, 2026 | 4:18 AM

శ్రీశైలం జలాశయం @ 101.92 టీఎంసీలు

04-08-2026 12:50 PM

* జలాశయానికి భారీ వరద.. 2.08 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

* జలాశయంలో 101.92 టీఎంసీల నీటి నిల్వ

*  విద్యుత్ ఉత్పత్తి, స్పిల్‌వే విడుదల నిలిపివేత

అచ్చంపేట: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 9 గంటల వరకు జలాశయంలో 101.921 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. సగటున 2,08,594 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇందులో జూరాల ప్రాజెక్టు విద్యుత్ కేంద్రం ద్వారా 28,369 క్యూసెక్కులు, స్పిల్‌వే ద్వారా 1,80,225 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు (269.750 మీటర్లు) కాగా, ప్రస్తుతం 858.70 అడుగులు (261.725 మీటర్లు) నమోదైంది. జలాశయంలో 101.921 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. ప్రస్తుతం జలాశయం నుంచి స్పిల్‌వే ద్వారా ఎలాంటి నీటి విడుదలలు చేపట్టడం లేదు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిపివేశారు. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో జలాశయ పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.