5 August, 2026 | 5:19 AM

సఫాయి అప్నా-బీమారీ భగావోతో స్వచ్ఛతపై అవగాహన

04-08-2026 12:46 PM

హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ చైర్‌పర్సన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో 8వ వార్డులో "సఫాయి అప్నా - బీమారీ భగావో (ఎస్‌ఏబీబీ)" కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిల్వ నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, పాత టైర్లు, కుండలు, ఇతర పాత్రల్లో నీరు నిల్వ కాకుండా చూడాలని, చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు.

డెంగ్యూ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అదేవిధంగా ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ (రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్) వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని, తడి–పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని కోరారు. స్వచ్ఛమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. కౌన్సిలర్లు సంపత్, కాశబోయిన సరిత, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ ఇంజనీర్ రవికుమార్, జవాన్ ప్రభాకర్, శ్రీకాంత్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.