23 May, 2026 | 3:20 AM

ఫిట్‌నెస్‌తోనే భవిష్యత్‌కు బలమైన పునాది

23-05-2026 12:00 AM
  1. యువత దేశానికి ఆదర్శంగా ఎదగాలి 
  2. అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు

నాగర్ కర్నూల్, మే 22 ( విజయక్రాంతి): చిన్నతనం నుంచే శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకుంటూ క్రమశిక్షణతో ముందుకు సాగితేనే యువత దేశ భవిష్యత్తుకు బలమైన శక్తిగా నిలుస్తారని జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో లక్ష అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రముఖ న్యూరాలజీ వైద్యులు డాక్టర్ హేమంత్ న్యూరో సహకారంతో స్పోరట్స్ అకాడమీ ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ హాజరై మాట్లాడుతూ, చదువుతో పాటు శారీరక వ్యాయామం కూడా విద్యార్థుల జీవితంలో అంతే ముఖ్యమని పేర్కొన్నారు.

క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి రోజు మైదానంలో చెమటోడ్చే విద్యార్థులే రేపటి సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. విద్యార్థులను కఠిన శిక్షణతో తీర్చిదిద్దుతున్న కోచ్ మల్లేష్ సేవలను ఆయన అభినందించారు. అలాగే విద్యార్థుల కోసం స్పోరట్స్ దుస్తులను అందించిన డాక్టర్ హేమంత్ న్యూరో దాతృత్వం ప్రశంసనీయమన్నారు.

డాక్టర్ హేమంత్ న్యూరో మాట్లాడుతూ, ప్రస్తుతం యువత సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఎక్కువగా తాగునీరు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. మంచి ఆరోగ్యం, క్రమశిక్షణ, పట్టుదల ఉన్న యువతే దేశానికి నిజమైన బలమని ఆయన ప్రేరణాత్మకంగా పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ నిర్వాహకులు చంద్రపాల్ రెడ్డి, కోచ్ మల్లేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.