calender_icon.png 8 February, 2026 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం

08-02-2026 01:21:47 AM

ఓటుకు నోటు కేసులో ఆధారాలు లేకుండా చేసేందుకేనా..?

  1. హార్డ్ డిస్క్‌లు, కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతి 
  2. కంప్యూటర్ విభాగంలోనే ఎగిసిపడిన మంటలు 
  3. ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు, విజయారెడ్డి కేసుల డేటాపై ఆందోళన 
  4. ఒకరికి అస్వస్థత.. తప్పిన ప్రాణాపాయం 
  5. షార్ట్‌సర్క్యూట్ కారణమని అధికారుల నిర్ధారణ

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 07 (విజయక్రాంతి): రాష్ర్టంలో సంచలనం సృష్టించిన అనేక కేసుల గుట్టు విప్పే కీలక ఆధారాలకు నిలయమైన నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభ వించింది. ఈ ప్రమాదంలో నేర పరిశోధనకు సంబంధించిన అత్యంత కీలకమైన డిజి టల్ సాక్ష్యాలు, హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు, పలు రికార్డులు కాలి బూడిదయ్యాయి.

ము ఖ్యంగా హైప్రొఫైల్ కేసుల డేటా నిక్షిప్తమై ఉన్న కంప్యూటర్ ల్యాబ్ విభాగమే మంటలకు ఆహుతి కావడం ఇప్పుడు రాష్ట్రవ్యా ప్తంగా చర్చనీయాంశంగా మారిం ది. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఎఫ్‌ఎస్‌ఎల్ భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూ టర్ విభాగానికి మంటలు అంటుకున్నాయి.

దట్టమైన పొగ భవనం మొత్తాన్ని కమ్మేయడంతో లోపల ఉన్న సిబ్బంది ప్రాణభ యంతో బయటకు పరుగులు తీశారు. మం టలను ఆర్పే క్రమంలో కృష్ణ అనే వార్డు బాయ్ పొగ కారణంగా ఊపిరాడక స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంపై అనుమానాలెన్నో..

ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లను భద్రపరుస్తారు. రాష్ర్టంలో తీవ్ర దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు, గతంలోని ఓటుకు నోటు వ్యవహారం వంటి కీలక కేసుల విశ్లేషణ ఇక్కడే జరుగుతోంది. ముఖ్యంగా తొమ్మిది రోజుల క్రితం చర్లపల్లి వద్ద పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో ఈ ప్రమా దం కీలక మలుపుగా మారింది.

ఆమె మర ణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు పంపిన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ డేటా ఇప్పుడు ఏమైందనేది ఉత్కంఠ గా మారింది. ఆ డేటా విశ్లేషణ పూర్తికాకముందే మంటలు చెలరేగడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రమాదం లో ఆయా కేసులకు సంబంధించిన డిజిటల్ డేటా ఏ మేరకు సురక్షితంగా ఉందన్న దాని పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కీలక ఆధారాలను రూపుమాపేందుకే ఈ ప్రమాదం జరిగిందా.. లేక ప్రమాదవశాత్త్తు జరిగిందా.. అన్న కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం : ఫైర్ డీజీ

ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని గుర్తించినట్టు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనం తరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోరెన్సిక్ ల్యాబ్ భవనం పురాతనమైనదని, 1980వ సంవత్సరంలో నిర్మించారని పేర్కొన్నారు. చివరి గదిలో ఉన్న స్విచ్ బోర్డ్ వద్ద షార్ట్ సర్య్కూట్ అయినట్టు తెలిపారు. అక్కడ నుంచి మంటలు వ్యాపించాయన్నారు.

ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారని తెలిపారు. హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ భవనాలను, రెసిడెన్షియల్, కమర్షియల్ కార్యాలయాలను తనిఖీ చేస్తామని చెప్పారు. ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని కాబట్టి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.

రెండు గంటలు.. ఐదు ఫైరింజన్లతో..

సమాచారం అందుకున్న వెంటనే ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అసెంబ్లీ, సచివాలయం వంటి పరిసర ప్రాంతాల నుంచి ఐదు ఫైర్ ఇంజన్లు వచ్చి సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. రెండో అంతస్తులో ఉండే కెమికల్ ల్యాబ్‌కు మంట లు వ్యాపించకుండా జాగ్రత్త పడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

ప్రమాద తీవ్రతపై డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని, క్లూస్ టీమ్ ద్వారా నష్టాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు. కంప్యూటర్ విభాగంలోని డేటా బ్యాకప్ ఉందా లేదా.. ఏయే కేసుల ఫైళ్లు కాలిపోయాయి.. అన్న దానిపై ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టరేట్ అంతర్గత విచారణకు ఆదేశించింది. భద్రతా వలయంలో ఉండే అత్యంత కీలకమైన కార్యాలయంలో ఇలాంటి ప్రమా దం జరగడం భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది.