భోలక్‌పూర్‌లో అగ్ని ప్రమాదం
- కాలి బూడిదైన గృహోపకరణాలు, వస్తువులు
- భయంతో పరుగులు తీసిన ప్రజలు
- భారీగా ఆస్తి నష్టం
- బాధితులను పరామర్శించిన కలెక్టర్ ప్రియాంక ఆల, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
ముషీరాబాద్, మే4 (విజయక్రాంతి) భోలక్‌పూర్‌ని డాక్టర్ వారీస్ వీధిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న అంజుమన్ ఐటిఐ భవనంలో కొసాగుతున్న15 ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
గోదామును ఆనుకోని ఉన్న మూడు భవనాలకు మంట లు వ్యాపించడంతో గోడలు పాక్షికంగా దెబ్బతినడంతో పాటు ఇంటి అద్దాలు, కిటికీలు కాలిపోయాయి. ఆదివారం అర్ధ రాత్రి 11గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో సోమవారం ఉదయం వర కు అగ్ని మాపక శాఖ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు 10 పైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. ఫైర్ ఇంజన్ల లో నీరు పూర్తిగా అయిపోతుండడంతో జలమండలి నుంచి వాటర్ ట్యాంక్లను తెప్పించి మం టలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
భయంతో జనం పరుగులు..
అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా ఉన్నజనావాసాల ప్రజలు ఇండ్ల లో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్లాస్టిక్ గోదాముల నుంచి మంటలు స్థానికంగా ఉన్న భవనాలకు వ్యాపించడంతో ఇండ్లలో ఉన్న పిల్లలు, పెద్దలు భయంతో బయటకు పరుగులు తీశారు. అప్పటికే ఇంట్లోని సామాగ్రి మంటలకు కాలి బూడిదై పోయాయి. సుమారు 8 కుటుంబాలకు అగ్ని ప్రమాదం వల్ల ఆస్థినష్టం సంభవించింది. ఇండ్లలోని గృహోపకారణ వస్తువులు, నిత్యవసర సరుకులు, బట్టలు కాలి బూడిదైపోయాయి. అనంతరం ప్రమాద బాధి తులను కలెక్టర్ ప్రియాంక ఆల, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌లు పరామర్శించి తగు నష్టపరిహారం ఇప్పిస్తామని, బాధితులకు అండగా ఉంటామన్నారు.






