18 June, 2026 | 2:39 AM

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

18-06-2026 01:25 AM

ఏపిలోని విజయవాడలో ఘటన

సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు

విజయవాడ, జూన్ 17: ఏపీలోని విజయవాడలోని రెయిన్‌బో చిన్న పిల్లల ఆసుపత్రి అత్యవసర వార్డులో షార్ట్ సర్క్యూట్‌తో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆసుపత్రిలో పొగలు అలముకున్నాయి. ఆసుపత్రి ప్రాంగణంలో రోగులు, బంధువులు కేకలు వేయడంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు.

రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. విద్యుత్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి పొగలు అలముకున్నాయని, ఆసుపత్రి సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని యాజమాన్యం పేర్కొంది.