ఏటీఎం అపహరణ
ఏపీలోని ఆకులేడులో ఘటన
అనంతపురం, జూన్ 17: దొంగలు ఏకంగా ఎస్బీఐ ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఏటీఎంను ఏపీలోని అనంతపురం జిల్లా శింగనమల మండలం ఆకులేడు శివారులో పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. బుక్కరాయ సముద్రం తాడిపత్రి ప్రధాన రహదారిపై ఉన్న ఎస్బీఐ ఏటీఎంను బుధవారం వేకువజామున దొంగలు అపహరించారు. గది అద్దాలను పగులగొట్టి, ఏటీఎంతో పాటు అందులో ఉన్న బ్యాటరీలను కూడా అపహరించుకుపోయారు.
విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ సుబ్బారాయుడు, ఎస్‌ఐ రాంప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్కాడ్ సాయంతో తనిఖీలు చేపట్టి, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఎత్తుకెళ్లిన ఏటీఎంకు చెందిన సామాగ్రిని శింగనమల మండలం ఆకులేడు గ్రామ పరిధిలో దొంగలు పడేసినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాలు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కాగా ఈ ఏటీఎంకు వందమీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండడం గమనార్హం.






