11-02-2026 06:33:05 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో దొంగ ఓట్లు కలకలం సృష్టించాయి. పట్టణంలోని 8వ వార్డులో ఓ వ్యక్తి దొంగ ఓటు వేయడానికి వచ్చాడని అతన్ని పట్టుకుని బయటకు పంపించారు. 9వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారన్న సమాచారంతో బీజేపీ నాయకుల నిఘా పెట్టారు. దేవునిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దేవునిపల్లిలో ఓటు వినియోగించుకుని 9వ వార్డులో ఓటు వేయడానికి రావడంతో బీజేపీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అతడిని పట్టుకున్నాడు. దాంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో ఇరువర్గాల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్త తలకు బలమైన గాయం కావడంతో రక్తస్రావం అయింది. దాంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణ, రూరల్ సీఐలు నరహరి, రామన్ చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన బీజేపీ కార్యకర్తను జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి మాట్లాడుతూ.. 9వ వార్డులో తిమ్మక్ పల్లి, కోటాల్ పల్లి, దేవునిపల్లి గ్రామాల నుంచి సుమారు 150 మందిని ఓటరు లిస్టులో చేర్చారని, వారందరితో దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నించారని ఆరోపించారు.