నులిపురుగుల నివారణకు మాత్రలు
చిన్నారులకు ఆల్బెండాజోల్ తప్పనిసరిగా వేయించాలి.
చేవెళ్ళ మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమత వెంకట్‌రెడ్డి.
చేవెళ్ళ జులై 13(విజయక్రాంతి): చిన్నపిల్లల జీర్ణాశయంలోని నులిపురుగుల నివారణకు ఆల్బెండాజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని చేవెళ్ల మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమతా వెంకట్‌రెడ్డి అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం చేవెళ్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమత మాట్లాడుతూ...1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి ఏడాదిలో రెండుసార్లు ప్రభుత్వం ఉచితంగా ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేస్తుందన్నారు.
నులి పురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, శరీర మానసిక ఎదుగుదల మందగింపు, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. మందు బిల్లలు వేయడం వల్ల నులి పురుగులను సమర్థవంతంగా నివారించడంతో పాటు పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల, పోషకాహార శోషణ మెరుగుపడుతుందన్నారు. జూలై 20న ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్, చేవెళ్ల ఏఏఎం ఎంఓ డాక్టర్ ఎ. వేదశ్రీ, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






