వైభవంగా....మల్లన్న అగ్నిగుండం వేడుకలు...
నిప్పుల పై నడిచి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
శివనామస్మరణతో మారుమోగిన ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం
పెద్ద పట్నంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్, (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గల శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి ఆలయంలో(Odela Mallikarjuna Swamy Temple) సోమవారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు జరిగాయి, ఈ అగ్నిగుండంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, ఓం నమశ్శివాయ అంటూ అందులో నడిచారు, అగ్నిగుండం లోని నిప్పుల పై నడిచి భక్తులు మోక్కులు చెల్లించుకున్నారు, అలాగే పెద్దపట్నం లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ,ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర నేటి అగ్నిగుండ మహోత్సవాలతో ఘనంగా ముగిసాయి, భక్తుల శివనామస్మరణతో మల్లికార్జున స్వామి ఆలయం మారుమొగింది, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు,పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకొని, మల్లన్న చల్లంగా చూడు అంటూ వేడుకున్నారు,అగ్నిగుండాల పై నడిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు, దాదాపు 1000 మంది ఒగ్గు పూజారులు పసుపు కుంకుమల తో పెద్ద పట్నాలు వేశారు, ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య , ప్రధాన అర్చకులు ధూపం వీరభద్రయ్య ,ఆలయ ఈవో సదయ్య , డైరెక్టర్లు, ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.






