28 May, 2026 | 3:49 AM

పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలి

28-05-2026 01:13 AM

జీవో ఎంఎస్ నెంబర్ 7ను రద్దు చేయాలి

బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాడికొండ విక్రమ్ గౌడ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ

ముషీరాబాద్, మే 27 (విజయక్రాంతి): బీసీ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న జీవో ఎంఎస్ నెంబర్7ను వెంటనే రద్దు చేయాలని, ఇంజనీరింగ్ విద్యలో అమలు చేస్తున్న10 వేల ర్యాంకు నిబంధనను పూర్తిగా ఎత్తివేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాడికొండ విక్రమ్ గౌడ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ డిమాండ్ చేశారు.

2008లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందారని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కలిసి వినతిపత్రాన్ని అందజేసినట్లు వారు వెల్లడించారు. 

అయితే అనంతరం వచ్చిన ప్రభుత్వం కేవలం బీసీ విద్యార్థులకే 10 వేల ర్యాంకు నిబంధన విధించడం అన్యాయమని, దీని వల్ల వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం10 వేల ర్యాంకు నిబంధనను వెంటనే రద్దు చేయాలని కోరారు.  పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సుమారు రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్,  స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ ప్రెసిడెంట్ వేముల రామకృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జనరల్ సెక్రెటరీ నాగరాజు గౌడ్, బీసీ రక్షక దళ్ చైర్మన్ ఉదయ్ నేత, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ మేరు, సురేందర్ ముదిరాజ్ బీసీ విద్యార్థి యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు.