19 May, 2026 | 4:44 PM

లారీలు లేక ధాన్యం తరలించక రోడ్డెక్కిన రైతన్న

19-05-2026 03:52 PM

రెండున్నర గంటలు నిలిచిపోయిన వాహనాలు.

బోథ్,(విజయక్రాంతి): మండలంలో కొనుగోలు చేస్తున్న మొక్కజొన్న పంట నిలువలు పేరుకుపోవడంతో రైతులు ఇబ్బందుల గురై మంగళవారం ధర్నాకు దిగారు. దాదాపు రెండున్నర గంటల పాటు ధర్నా కొనసాగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తూకం వేసి ఉంచిన పంటను తరలించకపోవడంతో తాము రాత్రి పగలు కాపలా ఉండాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేగాక మార్కెట్లో తూకం వేసిన దాదాపు 3000 బస్తాలు అలాగే ఉండిపోయాయని దీంతో కొత్తగా పంటను తీసుకువచ్చే రైతులకు స్థలం లేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన చేస్తున్నారు.

మరోవైపు ఎకరానికి 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే దిగుబడి మాత్రం 25 క్వింటాల నుండి 30 క్వింటాళ్ల వరకు వచ్చిందని ఆ పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు నిలదీశారు. మేము పండించిన పంటను అమ్ముకునేందుకు ఇన్ని ఆంక్షలు అంటూ రైతుల ఆగ్రహం వ్యక్తపరిచారు. రైతులు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకునే స్థానిక ఎస్సై పురుషోత్తం రైతులను సముదాయించారు.

అయినా రైతులు కలెక్టర్ మాట్లాడాలని డిమాండ్ చేయడంతో విషయాన్ని స్థానిక తాసిల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. తహసిల్దార్ సుభాష్ చంద్ర తో పాటు ఎంపీడీవో ఎల్ రమేష్. మార్కెట్ కమిటీ సెక్రటరీ విట్టల్. సీఈవో బారే భూషణ్ లు రైతులతో మాట్లాడడం జరిగింది. చివరికి తహసిల్దార్ కలెక్టర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.  తాము మార్కెట్కు తీసుకువచ్చిన మొక్కజొన్నకు సంబంధించిన డబ్బులను ఇచ్చామని మరోసారి హమాలి ఇవ్వాలంటే కుదరదని బీస్మించుకు కూర్చున్నారు. రైతుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన అధికారుల మాటతో రైతులు ధర్నాను విరమింప చేశారు.