2 May, 2026 | 8:13 PM

ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు

02-05-2026 06:45 PM

* మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యం 

* రైతు వారోత్సవాలను విజయవంతం చేయాలి

* జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్

అచ్చంపేట: ప్రజల అవసరాలను గుర్తించి.. వాటిని తక్షణమే పరిష్కరించేందుకు ప్రజా పాలన సభలు దోహదపడతాయని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. శనివారం అచ్చంపేటలోని బికే ప్యాలెస్ నిర్వహించిన ప్రజా పాలన  ప్రగతి ప్రణాళికలో అమలు చేస్తున్న 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా నియోజకవర్గ స్థాయి సభకు కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగమైన 99 రోజుల కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ.. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

గ్రామీణ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సంక్షేమం వంటి అంశాలను కేంద్రీకరించి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తున్నదని, నియోజకవర్గస్థాయిలో సభలు ప్రజలకు ప్రభుత్వంతో నేరుగా సంభాషించే వేదికగా మారాయని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారాలు అందించేందుకు  దోహదపడుతోందన్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

సభలో గ్రామస్తులు తమ సమస్యలు, అవసరాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా భూమి సంబంధిత సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణ పథకాలు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై వినతులను స్వీకరించి పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలలో రైతు భరోసా, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, సన్న వడ్లకు బోనస్, చేయూత పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలు ఉన్నాయన్నారు.

* నిరంతరంగా అభివృద్ధి పనులు 

 సాధారణ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. భవిష్యత్తులో చేపట్టబోయే పథకాలలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహార పథకం, ఒకరోజు విడిచి ఒకరోజు రాగి జావా మరియు వేడి పాలు అందించే కార్యక్రమం, మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు విస్తరించడం వంటి కార్యక్రమాలు ఉన్నాయని  తెలిపారు. దివ్యాంగ విద్యార్థులకు మోటార్ వాహనాల పంపిణీ, పంటల వైవిధ్యకరణ, సహజ సేంద్రియ వ్యవసాయం ప్రోత్సాహం అమలు చేయనున్నట్లు చెప్పారు.

ప్రజా పాలనలో భాగంగా మే 4 నుంచి నిర్వహించే రైతు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని, రైతులకు పంట మార్పిడి లాభదాయకమైన పంటలపై నేల సాంద్రత తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని  సూచించారు. 

* స్టాళ్ల పరిశీలన

సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన స్టాల్ ను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి రైతు పరిశీలించేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. సభలో వచ్చే వినతులను సంబంధిత శాఖాధికారులు వెంటనే పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి అవినీతి, ఆలస్యం చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అందాల్సిన అర్హులైన లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు బాధ్యతతో పని చేయాలని ఆయన స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, యువత, మహిళలు, రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. 99 రోజుల కార్యచరణ ప్రణాళిక ద్వారా పట్టణాలు, గ్రామాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ జిల్లా యంత్రాంగం లక్ష్యమని, తాగునీటి సమస్యల పరిష్కారం, అంతర్గత రహదారుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, విద్యా సంస్థల బలోపేతం, ప్రాథమిక ఆరోగ్య సేవల మెరుగుదల వంటి రంగాల్లో వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని, నియోజకవర్గ స్థాయి అధికారులు నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఆయా శాఖల అధికారులు సభలో వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, ఆర్డిఓ యాదగిరి, డీఎస్పీ శ్రీనివాసులు,  తహశీల్దారు సైదులు, మున్సిపల్ కమిషనర్ మురళి, డిప్యూటీ డిఎంహెచ్వో తారాసింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.