చోరీకి గురైన బైక్ ఇంటి ముందే ప్రత్యక్షం.. ముందు భాగం ధ్వంసం
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన పెంజర్ల సురేష్ కుమార్కు చెందిన ప్యాషన్ ప్లస్ (AP23R2935) ద్విచక్రవాహనం చోరీకి గురైన ఘటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఇంటి ముందు తాళం వేసి ఉంచిన బైక్ ఆదివారం ఉదయం కనిపించకపోవడంతో గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. పలు వాట్సాప్ గ్రూపులు, స్థానికుల ద్వారా సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో సోమవారం భిక్కనూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ డి. ఆంజనేయులు ,సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించి, గ్రామంలోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం సురేష్ కుమార్ ఇంటి ముందే చోరీకి గురైన బైక్ ప్రత్యక్షమైంది. అయితే బైక్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమై ఉండటంతో, దుండగులు బైక్‌ను వినియోగించి అనంతరం తిరిగి అక్కడే వదిలివెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు జరిగిన నష్టానికి న్యాయం చేయాలని పోలీసులను కోరాడు.






