27 July, 2026 | 3:25 AM

వర్షం మురిపించేనా.. అన్నదాతను గట్టెక్కించేనా?

27-07-2026 02:33 AM

మూడు రోజులుగా కురుస్తున్న వానలపై రైతుల ఆశలు

తొలకరి దెబ్బకు తట్టుకుని.. సాగుబాట పట్టిన కర్షకులు 

పత్తి, కంది, మిరప పైర్లకు ఈ వర్షాలు ఆసరానిచ్చేనా? 

ఇటిక్యాల, జూలై 26: గత కొంతకాలంగా వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఆందోళనలో ఉన్న ఇటిక్యాల మండల రైతాంగానికి ప్రస్తుత వర్షాలు కొంత ఊరటనిస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న చినుకులు పంటలకు ప్రాణవాయువులా మారుతాయ ని ఆశగా ఎదురుచూస్తున్నారు.

తొలకరి దెబ్బ.. తీరని నష్టం

సీజన్ ప్రారంభంలో కురిసిన తొలకరి జల్లులను నమ్మి రైతులు ఎంతో ఆశతో విత్తనాలు విత్తారు. అయితే, ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో సరిగా మొలకెత్తక, అనేక చోట్ల పైర్లు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాలకు ఎకరాలు పెట్టుబడులు పెట్టి విత్తనాలు వేస్తే, వర్షాభావంతో ఆ పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వర్షాలతోనైనా జీవం వచ్చేనా?

తొలకరి ఆశాభంగం కలిగించినప్పటికీ, ధైర్యం కోల్పోకుండా ఇటిక్యాల మండల రైతులు మళ్లీ సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా ప్రధానంగా పత్తి, కంది విత్తనాలతో పాటు విస్తారంగా మిరప నారు సాగు చేశారు. సరిగ్గా ఈ సమయంలోనే గత మూడు రోజులుగా వానలు కురుస్తుండటంతో భూమిలో తడి పెరిగి, ఈ పంటలకు ఎంతో అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాలు ఎండిపోతున్న పైర్లకు జీవం పోసి, తమను నష్టాల ఊబి నుంచి గట్టెక్కిస్తాయని ఇటిక్యాల రైతాంగం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఉద్యాన, వ్యవసాయ అధికారులు కూడా రైతులకు తగిన సలహాలు, సూచనలు అందించి తోడ్పాటు అందించాలని కోరుతున్నారు.