కల్లాల్లోనే ధాన్యం.. రైతుల పరిస్థితి అయోమయం.!
కనిపించని ఐకేపీ, సివిల్ సప్లై అధికారుల జాడ..?
అచ్చంపేట మే 28: అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పండించిన ప్రతి దాన్యం గింజను కొనుగోలు చేస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రము ఏర్పాటు చేశారు.
ప్రారంభంలో కొనుగోలు సాఫీగా జరిగినా ఆ తర్వాత దాన్ని అధికారులు విస్మరించారు. ఇప్పటి వరకు కేవలం నాలుగు లారీల వరి ధాన్యము పంపించారంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐకెపి, సివిల్ సప్లై అధికారులు కనీసం కళ్లాల్ల దగ్గరికి కూడా రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీని గురించి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేని రైతులు కలిసి వారి గోడును విన్నవించుకున్నారు.
అయినా అధికారులు స్పందించకపోవడం తీవ్రవిమర్శకు దారి తీస్తోంది. సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైన లారీలను తెప్పించడంలో ఐకెపి అధికారులు విఫలమ య్యారు. రైతుల ఇబ్బందులను గమనించి గ్రామానికి చెందిన సీఎం కార్యాలయం ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్ బొజ్జా అమరేందర్ రెడ్డి లారీలు తెప్పించి ధాన్యాన్ని తరలించేందుకు తమ వంతు సాయం అందించారు.
రైతుల ఆవేదన
అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం తరుగు విషయంలో స్థానిక ఎమ్మెల్యే రైస్ మిల్ అసోసి యేషన్ సభ్యులకి తరుగు తీయొద్దని చెప్పి నా.. మిల్లు యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ రైతులు ఆరోపిస్తున్నారు.
తరుగు విషయమై గ్రామ రైతులందరూ కలెక్టర్, సివిల్ సప్లై డిఎంకు వినతి పత్రం ఇచ్చినట్టు చెప్పారు. కానీ సరిగా స్పందించడం లేదని చెప్పారు. రైస్ మిల్ అసోసి యేషన్ లారీల విషయంలో ఏ ఒక్క మిల్లు అధికారి తన సొంత లారీని తమ గ్రామానికి ప్రొవైడ్ చేయలేక పోయారన్నారు. ఉప్పరపల్లి రైతుల మీద మిల్లు యజమానులు సవితి ప్రేమ చూపుతున్నారన్నారు.






