26 May, 2026 | 1:54 AM

రైతు సంక్షేమమే ధ్యేయం..

26-05-2026 12:57 AM
  1. రికార్డు స్థాయిలో పంట కొనుగోళ్లు..
  2. రూ. 50 లక్షలతో మార్కెట్ యార్డు ఆధునీకరణ
  3. మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి 

ఆమనగల్లు, మే 25( విజయక్రాంతి):  రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎమ్సీ) శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతోందని ఏఎమ్సీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి తెలిపారు. సోమవారం మార్కెట్ యార్డులో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల పరిధిలో ఐకేపీ, ప్యాక్స్ కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో పంటల కొనుగోళ్లు జరిపినట్లు వెల్లడించారు.

పత్తిపంట 3,15,000 క్వింటా ళ్లు (మిల్లుల ద్వారా),మొక్కజొన్న 70,260 బస్తాలు (557 మంది రైతుల నుండి),వరి ధాన్యం 35,965 క్వింటాళ్లు (691 మంది రైతుల నుండి),పొద్దుతిరుగుడు  3,000 బస్తాలు,మార్కెట్ పరిధిలో మిగిలి ఉన్న ధాన్యాన్ని రాబోయే 7 రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేస్తామని, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాలనే ఆశ్రయించాలని ఆయన కోరారు.

రూ. 50 లక్షలతో అభివృద్ధి పనులు..

రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డులో రూ. 14 లక్షలతో ఆధునిక గెస్ట్ హౌస్, రూ. 12 లక్షలతో ధాన్యం ఆరబోసేందుకు సీసీ ప్లాట్ఫాం, రూ. 24 లక్షలతో సరికొత్త గోడౌన్ నిర్మాణ పనులను పూర్తి చేశామని, ఇవి త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. రైతులకు ఎండ తీవ్రత దృష్ట్యా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచామన్నారు. తూకం, రవాణా ఇబ్బందులు లేకుండా మార్కెట్ డైరెక్టర్లు నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తాళ్ల రవీందర్, వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్, నరేష్ నాయక్, జెల్ల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.