calender_icon.png 23 February, 2026 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ మందులతో రైతు నారాజ్

23-02-2026 12:31:20 AM

  1. మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెంలో  వెలుగులోకి.. 

లాభాల కోసమే కొనసాగుతున్న నకిలీ దందా.. పంటలకు, ఆరోగ్యానికి హానికరం

అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న రైతన్న

అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

ముమ్మర తనిఖీలతో చెక్ పెట్టాలాంటున్న రైతులు

సూర్యాపేట, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి) : చెమట చుక్కలను నీరుగా మార్చి పంటలను పసిపాపలా కాపాడుకుంటున్న రైతన్నకు అడుగడునా నకిలీల బాధలు తప్పడం లేదు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇలా అన్నింటిలో నకిలీవి తయారు చేసి ప్రతి సందర్భములో మాయగాళ్లు రైతును ముంచుతూనే ఉన్నారు. ఇందుకు మంచి ఉదాహరణ సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వరి ఆగ్రో లింక్స్ దుకాణంలో అభ్యమైన రూ.3 లక్షల విలువ చేసే నకిలీ బేయర్ కంపెనీ నెటీవో మందు లభ్యం కావడం. 

 లాభాలకోసమే దందా

ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలకు పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్నందున  వివిధ రకాల రసాయన మందులను పిచికారి చేస్తున్నారు. దీనిని  అదునుగా చేసుకుని నకిలీ పురుగుమందులను తయారు చేస్తూ కొందరు స్వార్ధపరులు మోసాలకు పాల్పడుతుండగా, మరి కొందరు వాటిని అమ్మి ఎక్కువ లాభాలు పొందాలన్న దురుద్దేశ్యంతో నకిలీ మందులు అని తెలిసిన అమ్ముతూ రైతులను నిండా ముంచుతున్నారు.

ఈ ప్రమాదకర దందాకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసి కాలం చెల్లిన పాత చట్టాల స్థానంలో పురుగు మందుల నిర్వహణ బిల్లు-2025ను ప్రతిపాదించి, నకిలీ పురుగుమందుల తయారీదారుల ఆటకట్టించేందుకు రంగం సిద్ధం చేసింది. అయినా ఈ తంతు ఇంకా కొనసాగుతుండడం గమనార్హం.

విస్తరిస్తున్న నకిలీ వ్యాపార సామ్రాజ్యం 

ప్రస్తుత తరుణంలో వ్యవసాయంలో పురుగు మందుల వినియోగం ఒక అవసరం కాదు. రైతుకు ఆది అత్యవసర పరిస్థితిగా మారింది. పంటలో చిన్న తెగులు, పురుగు కనిపించినా.. మొత్తం పంట నాశనం అవుతుందేమో అన్న భయం రైతును వెంటాడుతోంది. అదే భయాన్ని అవకాశంగా మలుచుకుని, కొన్ని కంపెనీలు నాణ్యత లేని రసాయనాలను ఆకర్షణీయమైన ప్యాకింగ్లతో మార్కెట్లోకి నెట్టేస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం, దేశంలో ఏటా రూ.6-8 వేల కోట్ల వరకు నకిలీ పురుగుమందుల వ్యాపారం సాగుతోంది. 

నకిలీ మందులతో అప్పుల ఊబిలోకి :  

నకిలీ పురుగు మందుల ప్రభావం కేవలం రైతుల పైనేచూపి ఆగిపోవడం లేదు. వ్యవసాయ వ్యవస్థ మొత్తం  దెబ్బతింటోంది. రోగాలు తగ్గకపోగా పంట ఎండిపోవడం, పెరుగుదల ఆగిపోవడం దిగుబడులు పడిపోవడంతో రైతు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. అనర్ధాలు అనేకం :     నకిలీ మందులతో భూసారం క్రమంగా నాశనం కావడంతో పాటు భూగర్భజలాలు. పర్యావరణం కలుషితం అవుతున్నాయి. అదేవిధంగా పిచికారీ సమయంలో సరైన రక్షణ లేకపోవడం వల్ల రైతుల్లో శ్వాసకోస వ్యాధులు, చర్మ సమస్యలు వస్తున్నాయి. చివరికి ఆ విషపదార్థాలే మన ఆహారంలోకి చేరి ఆరోగ్యానికి హానీ కలిగిస్తున్నాయి. 

అప్రమత్తత అవసరం

నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువుల నియంత్రణకు చట్టాలు ఎన్ని కఠినంగా రూపొందించినప్పటికీ. క్షేత్రస్థాయిలో రైతు అప్రమత్తతే అన్నింటికన్నా బలమైన రక్షణ కవచం. అందుకే ప్రతి రైతు పురుగుమందుల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కొనుకోలు చేసేటప్పుడు ఖచ్చితంగా కంపెనీ పేరు. బ్యాచ్ సంఖ్య స్పష్టంగా నమోదైన ’పక్కా బిల్లు’ తీసుకోవాలి. మోసపోతే పోరాడేందుకు అదే ఆయుధమవుతుంది .దుకాణాధారులు తమ లాభాలకోసం చెప్పే మాటల ఉచ్చుకు చిక్కకుండా వ్యవసాయాధికారుల, శాస్త్రీయ సలహాలకు పెద్దపీట వేయాలి. 

రైతుకు మేలు జరిగే విధంగా నూతన చట్టం

ప్రస్తుతం అమలులో ఉన్న 1968 నాటి కీటక నాశిని చట్టం నేటి పరిస్థితులకు సరిపడే విధంగా లేదు. నామమాత్రపు జరిమానాలు, బలహీన శిక్షలు నకిలీమందులు తయారిందారులకు భయం కలిగించేవిగా లేవు. ఈ లోపాలను సరిదిద్దేందుకే కేంద్ర ప్రభుత్వం పురుగు మందుల నిర్వహణ బిల్లు-2025ను తీసుకొచ్చింది. ఈ బిల్లు నకిలీ మందుల తయారీదారుల్లో వణుకు పుట్టించేవిధంగా ఉండడం రైతులకు మేలు చేసే విషయం. అయితే వ్యవసాయ శాఖాధికారులు, పోలీస్ లు తనిఖీలు ఎక్కువగా చేస్తూ మోసాలు జరుగకుండా చూడాలని  రైతులు కోరుతున్నారు.              

కఠిన శిక్షలు అమలు చేయాలి                           

గంపెడు ఆశతో రైతులు పంట సాగు చేసి కంటిమీద కునుకు లేకుండా దాన్ని పసిపాపల కాపాడుకుంటారు. అయితే ఈ నకిలీ గాళ్ళ మాయతో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. నకిలీ మందులు తయారుచేసిన, అమ్మిన వారిపై కఠిన శిక్షలు వేస్తే ఈ నకిలీ మాయకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాలి.

గందె ఉపేందర్ రావు, రైతు,కట్టవారిగూడెం, గరిడేపల్లి మండలం.