అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ఉరుమడ్లలో అంగన్‌వాడీ, గ్రంథాలయ భవనాల ప్రారంభం
మెగా కంటి వైద్య శిబిరానికి శ్రీకారం
చిట్యాల,(విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్‌వాడీ భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సేవే తన ప్రథమ కర్తవ్యమని, పుట్టిన ఊరికి సేవ చేయడం కన్న తల్లికి సేవ చేసినంత సంతృప్తిని ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ ఎమ్మెల్యేల సహకారంతో నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చిన ఆయన, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే కంటి, దంత సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అనంతరం గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ నెల 20 నుంచి 26 వరకు ఉరుమడ్ల గ్రామంలోని తన నివాసంలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ సుమారు 200 మందికి ఉచిత వైద్య పరీక్షలు, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. పేదల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన గుత్తా అమిత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.






