20 June, 2026 | 7:30 PM

రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా

20-06-2026 06:16 PM

రైతుల ఉసురు తీసేందుకే రైతు డిస్కం

పాత్రికేయుల సమావేశంలో భారాస కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు

మానకొండూరు,(విజయక్రాంతి): అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అబద్ధపు హామీలిచ్చి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోట మేరకే పంటలను కొనుగోలు చేస్తామని ప్రకటించడం రేవంత్ సర్కారు రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను, నమ్మించి నట్టేట ముంచటమేనని కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి గింజ వరకు బోనస్ చెల్లించి, పంటలను కొనుగోలు చేస్తామన్న హామీ ఇప్పుడు ఏమైందని నిలదీశారు.

24 గంటల ఉచిత విద్యుత్తుకు ఉరివేయడానికే రైతు డిస్కం ను రేవంత్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు. శనివారం మండల కేంద్రమైన మానకొండూరులో భారాస పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జీవీఆర్ మాట్లాడారు. కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, లింగాల లక్ష్మణ్, గంప వెంకన్న, పాకాల మహిపాల్ రెడ్డి, గంట మహిపాల్ మాడుగుల రవీందర్ రెడ్డి, సతీష్ రెడ్డి, పార్నంది కిషన్ పిట్టల మధు, శాతరాజు యాదగిరి, రామంచ గోపాల్ రెడ్డి తదితరులు ఈ పాత్రికేయుల సమావేశానికి హాజరయ్యారు.

గత పదేళ్ల పాటు లేని యూరియా కొరతను సృష్టించిన ఘనత ఏ పాలకులదని పరోక్షకంగా చురకలంటించారు. చి "వరి "కి రైతులు పంట కొనుగోలు కేంద్రాల్లోనే ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఎందుకు దాపరించిందని మీడియా సాక్షిగా నిలదీశారు. ధాన్యం కుప్పల మీద అన్నదాతలు అసువులు బాసినా, ఈ ప్రభుత్వానికి కనికరం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ 72 సార్లు ఢిల్లీ యాత్రలు చేసిన రేవంత్ పంట కొనుగోలు విషయాన్ని ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించారా అని ప్రశ్నించారు. ప్రజల, రైతుల సమస్యల పై కాడి పడేసిన కాంగ్రెస్ సర్కారుకు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా 45 వేల చెరువుల పూడిక తీసి భూగర్భ జలాలను పెంచామని చెప్పారు.

తెలంగాణకే తలమానికమైన కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు సౌకర్యం కల్పించామని వివరించారు. నాటి సమైక్య రాష్ట్రంలో 60 ఏళ్ల పాటు రైతులు అరిగోసపడ్డారని, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు తదితరుల సమస్యలతో తల్లడిల్లిన తెలంగాణ రాష్ట్రానికి గాడిలో పెట్టిన కేసీఆర్ ఘనత చరిత మరువదన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం  ఏళ్ల పాటు అభివృద్ధి లో వెనుకబడి, నాటి సమైక్య రాష్ట్ర పరిస్థితిలో, నేడు రైతన్నలు దుర్భర దుస్థితిలో అరిగోస పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై, పార్టీ పక్షాన అలుపెరుగని పోరాటం కొనసాగిస్తామని జీవీఆర్ హెచ్చరించారు.