20 June, 2026 | 7:46 PM

సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ

20-06-2026 06:29 PM

ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందు ఏరియాలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను అర్హులైన ఉద్యోగులందరికీ కేటాయించి, కోయగూడెం ఓసీపీ కార్మికులకు కూడా క్వార్టర్ల కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీనియర్ పర్సనల్ అధికారి సుధాకర్‌కు శనివారం ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేశారు. అనంతరం బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఇల్లందు ఏరియాలో సుమారు 500 నుంచి 600 క్వార్టర్లు అందుబాటులో ఉండగా ఉద్యోగులు 400 మంది మాత్రమే ఉన్నప్పటికీ అనేక క్వార్టర్లు ఖాళీగా ఉండటం వల్ల కంపెనీ ఆస్తులు నిరుపయోగంగా మారుతున్నాయని తెలిపారు.

ఖాళీ క్వార్టర్లలో చోరీలు, ఆక్రమణలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నాయని, దీంతో కంపెనీ ఆస్తులకు నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న క్వార్టర్లను అర్హులైన ఉద్యోగులకు కేటాయించడం ద్వారా ఆస్తుల పరిరక్షణతో పాటు ఉద్యోగుల సంక్షేమం కూడా సాధ్యమవుతుందని అన్నారు. కోయగూడెం ఓసీపీ ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించకపోవడాన్ని ఖండిస్తూ, ఇతర ఏరియాల్లో పనిచేస్తున్నా కుటుంబాలు ఇల్లందులో నివసిస్తున్న ఉద్యోగులకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు.