ప్రతి ఇంటికీ కుటుంబ రిజిస్టర్
- సర్టిఫికెట్ కోసం మీ సేవ కేంద్రాల్లో లేదా మీ సేవ ఆన్‌లైన్ పోర్టల్, మొబైల్ యాప్‌లో దరఖాస్తు
- రేషన్ కార్డుల డేటా ఆధారంగా డిజిటల్ రూపం
- త్వరలోనే అమల్లోకి తేనున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలకు పౌర సేవలను మరింత వేగవంతంగా, సులభంగా అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల కోసం త్వరలోనే ‘కుటుంబ రిజిస్టర్’ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆహార భద్రత (రేషన్) కార్డుల డేటా ఆధారంగా ఈ కుటుంబ వివరాలను ప్రభుత్వం డిజిటల్ రూపంలో నిర్వహించనుంది.
ఈ నూతన విధానం ద్వారా ప్రతి కుటుంబానికీ సంబంధించిన సమగ్ర వివరాలు అధికారిక రికార్డు రూపంలో భద్రంగా అందుబాటులో ఉంటాయి. పౌరులు వివిధ ప్రభుత్వ పథకాలు, ధ్రువీకరణ పత్రాలు పొందడానికి పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుం డా, సులభంగా సేవలు పొందేందుకు ఈ రిజిస్టర్ దోహదపడనుంది. అర్హులైన పౌరులకు మీ సేవ కేంద్రాల ద్వారా అధికారికంగా ‘కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్ ’ జారీ చేయబడుతుంది.
ప్రజలు ఈ సర్టిఫికెట్ కోసం నేరుగా మీ సేవ కేంద్రాలను సందర్శించవచ్చు లేదా ‘మీ సేవ ఆన్‌లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా కూ డా సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దరఖాస్తు చేసుకున్న 2 పని దినాలలోపే ఈ సర్టిఫికెట్ జారీ అవుతుంది. స్థానిక తహసీల్దార్ డిజిటల్ సంతకంతో ఇది జారీ చేయబడుతుంది.
ఈ సర్టిఫికెట్ పొందడానికి మీసేవా ద్వారా రూ.62 సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ‘కుటుంబ రిజిస్టర్’ వ్యవస్థను త్వరలోనే పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కేవలం కుటుంబ సభ్యుల సమాచారాన్ని ధ్రువీకరించే రికార్డు మాత్రమే. దీనిని ఆస్తి హక్కులకు, చట్టబద్ధమైన వారసత్వానికి లేదా సంక్షేమ పథకాలకు అర్హతగా పరిగణించరు.






