31 July, 2026 | 8:19 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

ఆపరేషన్ ముస్కాన్-12లో బాల కార్మికులపై ఉప్పల్ పోలీసుల ఉక్కుపాదం

31-07-2026 07:04 PM

80 మంది బాలబాలికల రక్షణ.. యజమానులపై కేసులు నమోదు

ఉప్పల్,(విజయక్రాంతి): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్-12లో ఉప్పల్ సబ్ డివిజన్ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి 80 మంది బాలబాలికలను గుర్తించి రక్షించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఉప్పల్ సబ్ డివిజన్ ఏసీపీ వై. వెంకట్ రెడ్డి, ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ వై. రామలింగారెడ్డి పర్యవేక్షణలో, ఎహెచ్‌టీయూ ఎల్‌బీ నగర్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్ ఇన్‌చార్జ్ కె. ఇద్దయ్య నేతృత్వంలోని రెస్క్యూ బృందం ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది.

చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజ్ వంటి కేసులను గుర్తించి, బాలబాలికలను రక్షించడంతో పాటు సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. బాల కార్మికులను పనుల్లో నిమగ్నం చేసిన యజమానులపై కేసులు నమోదు చేసి, బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు.ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఎఫ్‌ఐఆర్‌లు, 21 జీడీలు, నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో 9 ఎఫ్‌ఐఆర్‌లు, 14 జీడీలు, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఎఫ్‌ఐఆర్‌లు, 6 జీడీలు నమోదు అయ్యాయి.

మొత్తం 80 మంది బాలురు, బాలికలు గుర్తించి రక్షించబడ్డారు.రక్షించబడిన బాలబాలికలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ ఎదుట హాజరుపరచగా, కేసుల తీవ్రతను బట్టి సంబంధిత యజమానులు ఒక్కో బాలుడి పేరిట రూ.18,000 నుంచి రూ.40,000 వరకు డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలో కలెక్టర్ కార్యాలయంలో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీసు శాఖతో పాటు బాలల సంక్షేమ విభాగం సమన్వయంతో చేపట్టిన ఈ చర్యలు బాలల భవిష్యత్తు రక్షణకు దోహదపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.