మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు
- సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి
కొండపాక,(విజయక్రాంతి): కుక్కునూరు పల్లి మండలం లకుడారం గ్రామం రాజీవ్ రహదారి పక్కన ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. తేది 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమైనందున ఉదయం 7:30 కి విద్యార్థులు ఏమీ తినకుండా వస్తున్నారని 10:30 లకు అన్నం కూర సాంబార్ తో భోజనం వడ్డించినట్లు ప్రిన్సిపల్ కలెక్టర్ కి తెలిపారు. పదవ తరగతి గదిలోకి వెళ్లి బుధవారం హిందీ పరీక్ష అందువలన వివరంగా చదివి అర్థం చేసుకొని పరీక్ష రాయాలని మిగతా పరీక్షలు కూడా బాగా రాయాలని ఈ సమయాన్ని వృధా చేయకూడదని తెలిపారు.
అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి వార్షిక పరీక్షలు ఎప్పటి నుంచి, ఉదయం ఏమి తిన్నారు అని విద్యార్థులను అడగగా. విద్యార్థులు ఏప్రిల్ 10వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు, సాంబారు తో అన్నం తిన్నామని కలెక్టర్ కి తెలిపారు. సమయం వృధా చేయకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని చదవాలని సూచించారు. విద్యార్థులకు అన్నం, సాంబారు తో మాత్రమే పెట్టి, సాంబారు, కూర పెట్టామని చెప్పినందుకు ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం విషయంలో అబద్ధం చెబుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని మళ్లీ పునరావృత్తం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.




