రోడ్డు భద్రతకై వాహనదారులకు కంటి పరీక్షలు తప్పనిసరి
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఐ క్యాంప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” కార్యక్రమం కింద ఈ ఐ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్‌లో లారీ, ఆటో సహా ఇతర వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, డ్రైవర్ల కంటి చూపు లోపం కూడా ప్రమాదాలకు ఒక కారణమవుతుందని తెలిపారు. అందువల్ల ప్రతి డ్రైవర్ ఈ ఐ క్యాంప్‌లో పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స పొందాలని, తమ ఆరోగ్యాన్ని మరియు జీవితాన్ని కాపాడుకోవాలని సూచించారు. వాహనం నడిపేటప్పుడు జరిగే అనుకోని ప్రమాదాలు కుటుంబాలకు తీరని నష్టం కలిగిస్తాయని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్ రెడ్డి, డీసీఆర్‌బీ సీఐ ఉపేందర్ రావు, ఆర్ఐ జగన్, ఎస్సై గోవర్ధన్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ కళ్యాణ్, ప్రశాంత్, ఆర్టీఓ అధికారి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






