26 May, 2026 | 1:54 AM

అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

26-05-2026 12:00 AM

జిన్నారం మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు

జిన్నారం/ అమీన్‌పూర్, మే 25 : జిన్నారం మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ పరిధిలోని  శివనగర్, రాళ్లకత్వ, రాళ్లకత్వ తండా, సోలక్పల్లి, అండూర్, ఇమామ్ నగర్, ఊట్ల, దాదిగూడెం, మంగంపేట, జిన్నారం, జంగంపేట, కొడకంచి, నల్తూరు, కొర్లకుంట వార్డుల్లో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక పాలకవర్గంతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 75 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడం  జరిగిందని తెలిపారు.

ప్రజల నమ్మకంతో ఐదు మున్సిపాలిటీలో బిఆర్‌ఎస్ పార్టీకి అధికారం అందించారని.. వారి నమ్మకానికి అనుగుణంగా వచ్చే ఐదు సంవత్సరాల పాటు మున్సిపల్ సమగ్ర అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పాలకవర్గం సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.