26 August, 2026 | 3:07 AM

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

26-08-2026 12:00 AM

జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్

నల్లగొండ టౌన్, ఆగస్టు 25: వనమహోత్సవం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆన్నారు. వన మ హోత్సవంలో భాగంగా మంగళవా రం నల్గొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో రహదారికి ఇరువైపులా 800 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వనమహోత్సవం కింద ఈ ఏడాది లో జిల్లాలో 57 లక్షల 70 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.

ఇప్పటివరకు దాదాపు 60 శాతం మొక్కలు నాటడం పూర్తయిందని తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు.సామూహికంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని, జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీల్లో, అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్థలం ఉన్న ప్రతి చోట మొక్కలు నాటుతున్నామన్నారు. ప్రస్తుతం జిల్లాలో అక్కడక్కడా తుంపర వర్షాలు కురుస్తున్నందున దీన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.

నాటిన ప్రతి మొక్కకు నిరంతరం నీరందించాలని, ఇందుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను వినియోగించుకోవాలని, అవసరమైతే విబిజీరామ్ జీ కింద వాచర్ ను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వి.రమేష్, డీఎఫ్‌ఓ రాజశేఖర్, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్, ఫారెస్ట్ రేంజ్ అధికారి రవీందర్, ఉప సర్పంచ్ జే.కే.సతీష్, మాజీ జెడ్పీటీసీలు గుమ్మల మోహన్ రెడ్డి, వంగురు లక్ష్మయ్య, కోదండపూర్ సర్పంచ్ రాణి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.