29 June, 2026 | 1:41 AM

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

29-06-2026 12:00 AM

కలెక్టర్ కె.హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): జిల్లాలో ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజంపేటతో పాటు కాగజ్నగర్ మున్సిపల్ పరిధిలోని కాపువాడ అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఒక్క చిన్నారి కూడ పోలియో చుక్కలకు దూరం కాకుండా అధికారులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని కోరారు. అనంతరం పోలియో కేంద్రంలో వ్యాక్సిన్ నిల్వలు, చిన్నారుల నమోదు, కార్యక్రమం నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

ఓటరు జాబితా సవరణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కాగజ్నగర్ మున్సిపల్ పరిధిలోని మొదటి వార్డులో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.జూలై 24 వరకు కొనసాగే ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి, బీఎల్‌ఓ యాప్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు.