మతాల పేరుతో రాజకీయాలు చేస్తే ఫలితాలు శూన్యం
మైనార్టీల సంక్షేమానికి సర్కార్ కృషి
జగిత్యాల జిల్లా కేంద్రంలో మైనార్టీ డిగ్రీ కళాశాల ఏర్పాటు
రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్
జగిత్యాలతో మంత్రి అడ్డూరితో కలిసి మీడియా సమావేశం
జగిత్యాల,(విజయక్రాంతి): మతాల పేరుతో రాజకీయాలు చేస్తే అభివృద్ధి శూన్యమని తాను మత రాజకీయాలకు దూరంగా ఉంటానని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ 1969 నుండి మొదలుకొని అనేక ఉద్యమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వరాష్ట్రాన్ని 2014లో సాధించుకున్నారని అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
క్రికెటర్ గా తన కెరియర్ ప్రారంభించి ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నానని మంత్రి తెలిపారు. మతాల పేరుతో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ అన్నారు. గత రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని టీం వర్క్ చేస్తేనే ఫలితాలు వస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైసింగ్ తెలంగాణ పేరుతో ముందుకు సాగుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు గుర్తింపు తీసుకు వస్తున్నారని అన్నారు. విద్యా ద్వారానే సమాజంలో మార్పులు వస్తాయని అందుకు అనుగుణంగా విద్య వ్యవస్థలో ముఖ్యమంత్రి సమూల మార్పులు తీసుకువచ్చారని మంత్రి అజారుద్దీన్ తెలిపారు.
జగిత్యాల జిల్లాలో మైనార్టీ సమస్యలు ఉన్నాయని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మైనార్టీల సమస్యల పై ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అజారుద్దీన్ స్థానిక నాయకులను కోరారు. జిల్లా కేంద్రంలో ఈద్గా, కబరస్థాన్ ఏర్పాటు పై కలెక్టర్ తో మాట్లాడి సమస్య ను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. విద్యార్థుల స్కాలర్ షిప్ సమస్యను పరిష్కరిస్తానని, జగిత్యాల లో మెడికల్ కాలేజ్ ను చూస్తే సంతోషంగా ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఉర్దూ పాఠశాల సమస్యని పరిష్కరిస్తాని హామీ ఇచ్చారు. నేను బ్యాటింగ్ ఎంత స్పీడ్ గా చేస్తానో నేను మంత్రిగా అలానే పని చేస్తానని అన్నారు.
జగిత్యాలలో మైనార్టీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని, గ్రామీణ ప్రాంతాల్లోనే క్రీడాకారులకు సైతం జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగే విధంగా తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. జగిత్యాల జిల్లాలోని మైనార్టీ సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి మంత్రి అజారుద్దీన్ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా కోరారు. క్రీడకారునిగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర ప్రజల సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషమని మంత్రి అడ్లూరి అన్నారు.
క్రీడాకారులకు కులం, మతం ఉండదని మంత్రి తెలిపారు. అజారుద్దీన్ మంత్రిగా రాణించి అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ప్రాజెక్ట్ ల నిర్మాణం జరిగిందని జగిత్యాల జిల్లా వ్యవసాయానికి మారుపేరుగా మారడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.






