23 May, 2026 | 2:39 AM

ప్రజల సహకారంతోనే గంజాయి నిర్మూలన

23-05-2026 12:17 AM

మంచిర్యాల డీసీపీ భాస్కర్

మంచిర్యాల, మే 22 (విజయక్రాంతి) : ప్రజల సహకారంతోనే గంజాయి నిర్మూలన సాధ్యమవుతుందని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ కేంద్రాన్ని మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ తో కలిసి డీసీపీ శుక్ర వారం సందర్శించారు. చికిత్స పొందుతున్న యువకులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిని కోర్టు ఆదేశాల మేరకు 15 రోజుల పాటు డి-అడిక్షన్ సెంటర్కు పంపిస్తున్నామని తెలిపారు. ఇక్కడ వారికి వైద్య చికిత్సతో పాటు మానసికంగా మార్పు తీసుకురావడానికి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 19 మందికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వచ్చిన వారిని డి-అడిక్షన్ సెంటర్లకు తరలించినట్లు వెల్లడించారు.

గంజాయి సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, అలాగే గంజాయి సేవించే వారిని గుర్తించి వారిని ఆ అలవాటు నుంచి దూరం చేస్తే సరఫరా కూడా తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు,పెద్దలు తమ పరిసరాల్లో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నా లేదా సేవిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఒక సారి చికిత్స పొందిన తర్వాత కూడా మళ్లీ మత్తు పదార్థాలకు బానిసై పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

నిపుణులైన వైద్యుల సహాయంతో మత్తు బారిన పడిన వ్యక్తులు తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చే అవకాశం ఉందని, డ్రగ్స్ రహిత మంచిర్యాల నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డీసీపీ వెంట మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్ రావు, ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీమన్నారాయణ, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాంనాయక్ తదితరులున్నారు.