ఎపిక్ ఆ సినిమాల సరసన చేరే చిత్రం
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘ఎపిక్ : ఫస్ట్ సెమిస్టర్’. 90’స్ వెబ్‌సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకునన దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాతో వెండితెరపై అడుగుపెడుతున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా ఈ టీజర్‌ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన టీజర్ ఆవిష్కరణ వేడుకలో కథానాయకుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “ఎపిక్’ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది.
ఆదిత్య హాసన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది. నాలా విదేశాలకు వెళ్లి చదువుకున్నవాళ్లకే కాదు.. కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. సార్, లక్కీ భాస్కర్, టిల్లు, మ్యాడ్, జెర్సీ లాంటి సినిమాల సరసన ఎపిక్ చేరుతుందనే నమ్మకం ఉంది” అన్నారు.
కథానాయిక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. “ఈ కథ వినగానే నేను ఈ సినిమాలో భాగం కావాలనుకున్నా. నేను పోషించిన కడలి పాత్ర చాలా బాగుంటుంది. కథ వినేటప్పుడు ఆ కడలి నాలో ఉందేమో అనిపించింది. చాలామంది అమ్మాయిల్లో ఆ కడలి ఉంటుంది అనిపించింది. ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర కూడా బాగుంటుంది. ఎపిక్ నా మనసుకి దగ్గరైన సినిమా. ఇదొక అందమైన ప్రేమకథ. మనల్ని మనం చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే మన స్నేహితులు గుర్తుకొస్తారు” అని చెప్పారు. ‘ప్రతి ఒక్కరికీ చేరువయ్యే ప్రేమకథ ఇద’ని దర్శకుడు ఆదిత్య హాసన్ తెలిపారు.






