30 June, 2026 | 11:36 AM

​రైతు ఆశీర్వాద సభ వాయిదా

30-06-2026 10:40 AM
  1. ​రైతు ఆశీర్వాద సభ వాయిదా 
  2. హైదరాబాద్ లో ​రైతు భరోసా నిధులు విడుదల 
  3. అతి త్వరలో రైతు ఆశీర్వాద సభ
  4. విలేకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  5. సభా స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం, మంత్రి తుమ్మల

ఖమ్మం, చింతకాని, జూన్ 29(విజయక్రాంతి): ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ, ప్రజా కార్యక్రమాలను మెచ్చి వరణ దేవుడు కూడా కారుణించడాని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భారీ వర్షాల కారణంగా ఈ నెల 30న తలపెట్టిన రైతు ఆశీర్వాద సభను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సభా ప్రాంగణం అంతా బురదమయంగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కారణం వల్ల రైతులకి ప్రజలకి కాంగ్రెస్ కార్యకర్తలకి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతోనే సభ నిర్వహణలో మార్పులు చేసినట్లు ఆయన చెప్పుకుచ్చారు. 

ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో తలపెట్టిన రైతు ఆశీర్వాద సభ ప్రాంతాన్ని సోమవారం మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పరిశీలన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షలాది మంది రైతుల సమక్షంలో ముఖ్యమంత్రి,  కేబినెట్ మంత్రులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించాలని భావించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 11 వాతావరణ పరిస్థితుల్లో ఇక్కడ సభ నిర్వహించడం అందరికీ ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. ​తొలిరోజు ప్రారంభ సభగా అనుకున్న ఈ కార్యక్రమాన్ని, ఇప్పుడు రైతు భరోసా పంపిణీ పూర్తి అయిన తర్వాత మరింత ఉత్సాహంగా 'రైతు ఆశీర్వాద సభ' పేరుతో ముగింపు వేడుకగా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వర్షాలు తగ్గిన తరువాత వాతావరణ శాఖ నివేదికలను అనుసరించి ముఖ్యమంత్రి, కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. 

​సభ నిర్వహణ తేదీలపై ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ... జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి వారం రోజుల ముందస్తు అంచనాలను తీసుకుంటుందని ఆయన అన్నారు. జులై నెల 3, 4 తేదీల వరకు వర్షాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు.  రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు మరో వారం రోజుల వాతావరణ సమాచారాన్ని సేకరించాలని ఆదేశించాం. వాతావరణ పరిస్థితిని బట్టి ఈ సభను వచ్చే 6, 7 లేదా 8వ తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 

​ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సత్తెపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయిలతో పాటు జిల్లాలోని శాసనసభ్యులంతా సమన్వయంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న మిగతా ఎమ్మెల్యేలు, ప్రజలు, రైతాంగ సోదరులు ఈ సభకు తరలిరావడానికి భారీ ఉత్సాహాన్ని చూపిస్తున్నారని, ప్రజలు ఊహించని రీతిలో ఈ సభ అత్యంత విజయవంతం కాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.