హామీలు అమలయ్యే వరకు కాంగ్రెస్‌ను నిలదీస్తాం
నా భద్రతకు సీఎం రేవంత్‌రెడ్డిదే బాధ్యత.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
గద్వాల: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత భద్రతను కక్షపూరితంగా తగ్గించారని ఆరోపిస్తూ తనకు ఏదైనా అపాయం జరిగితే దానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని హెచ్చరించారు.సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌తో పాటు మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ర్యాలంపాడు,గట్టు ఎత్తిపోతల పథకం,నెట్టంపాడు వంటి కీలక ప్రాజెక్టుల పెండింగ్ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుకు సాగడం లేదని విమర్శించారు.ఇటీవల ముఖ్యమంత్రి గద్వాల పర్యటనలో ఈ ప్రాజెక్టుల పరిస్థితిపై స్పష్టత ఇవ్వకపోవడం నిరాశ కలిగించిందన్నారు.చిన్న కాలువల్లో పెరిగిన చెట్లను కూడా తొలగించని పరిస్థితి నెలకొనడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.రైతుల సాగు,తాగునీటి అవసరాలకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.గురుకుల విద్యాసంస్థల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తోందని తెలిపారు.
ఈ పోరాటం వెనుక విద్యార్థులకు న్యాయం చేయాలనే లక్ష్యమే ఉందన్నారు.కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు,పుస్తకాలు,ఇతర సామగ్రి అందించేవారని ప్రస్తుతం కూడా అదే స్థాయిలో పారదర్శకంగా నాణ్యమైన వస్తువులు అందించాలని కోరారు.తన భద్రత తగ్గింపుపై స్పందిస్తూ తాను 26 ఏళ్లపాటు ఐపీఎస్ అధికారిగా దేశానికి సేవ చేశానని రాష్ట్రపతి శౌర్య పతకం కూడా అందుకున్నానని గుర్తుచేశారు.
కాంగ్రెస్,టీడీపీ,బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో అధికారిగా పనిచేసినా ఎప్పుడూ తన భద్రతను తగ్గించలేదని ఇప్పుడు మాత్రం రాజకీయ కక్షతో భద్రతను తగ్గించారని ఆరోపించారు.ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే తనపై కక్ష సాధిస్తున్నారని అన్నారు.భద్రత తొలగించినా,బెదిరించినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపబోనని ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌ను వీడనని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర రెడ్డి,నాగర్ దొడ్డి వెంకట్రాములు, జి.రాఘవేంద్ర రెడ్డి,అంగడి బసవరాజ్,ఆతుకూరి రెహమాన్,కౌన్సిలర్ చంటన్నతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువజన విభాగ సభ్యులు పాల్గొన్నారు.






