సింగరేణి అధికారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
‘ఆల్ సింగరేణి డిక్లరేషన్’లో డిమాండ్
వేజ్ రివిజన్, పీఆర్‌పీ బకాయిల చెల్లింపు, పారదర్శక ప్రమోషన్ పాలసీ అమలుకు పిలుపు
సత్తుపల్లి,జూన్ 30,(విజయక్రాంతి): సత్తుపల్లి, సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) ఆధ్వర్యంలో ‘ఆల్ సింగరేణి డిక్లరేషన్’ ప్రకటించారు. అధికారుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. డిక్లరేషన్‌లో భాగంగా సింగరేణి అధికారులకు పెండింగ్‌లో ఉన్న వేజ్ రివిజన్‌ను వెంటనే అమలు చేయాలని, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్‌పీ) బకాయిలను తక్షణమే చెల్లించాలని, పారదర్శకమైన ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని, అలాగే సింగరేణికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు.
సింగరేణి సంస్థ అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి న్యాయమైన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం ఆందోళనకరమని సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. అధికారుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం సానుకూల దృక్పథంతో స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. "మా ఐక్యతే మా బలం... హక్కుల కోసం పోరాడుదాం" అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సింగరేణి అధికారులు పాల్గొని తమ ఐక్యతను చాటారు. పాల్గొన్న వారిలో డి. శ్రీనివాస్ (సర్వే ఆఫీసర్), ఎ. అవినాష్ (డిప్యూటీ మేనేజర్), కె. రాజేష్ (డిప్యూటీ మేనేజర్), ఎ. ప్రదీప్ (ఈఈ, జేవీఆర్ సీహెచ్‌పీ), వి. వేమారెడ్డి (ఎస్‌ఈ, ఎస్‌ఎంఎంసీ–పదవీ విరమణ) తదితరులు ఉన్నారు.






