19 June, 2026 | 2:52 AM

విద్యార్థుల నమోదు శాతం పెంపునకు కృషి చేయాలి

19-06-2026 12:08 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జూన్ (18): ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. గురువారం కలెక్టర్ చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు..ఈ సందర్శనలో భాగంగా కలెక్టర్ పాఠశాలలోని అన్ని తరగతి గదులను, మధ్యాహ్న భోజన శాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం విద్యార్థులతో ముచ్చటించి, వేసవి సెలవులు ఎలా గడిపారని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైనందున విద్యార్థులం తా క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో మౌలిక వసతులు, సౌకర్యాలు అద్భుతంగా ఉన్నప్పటికీ, విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో హాజరు శాతాన్ని గణనీయంగ పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి జ్ఞానాన్ని పరిశీలించారు. విద్యార్థులంతా బాగా చదువుకుని, ఉన్నత విద్యావంతులుగా మారి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని విద్యార్థులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.  విద్యార్థులలో పఠనాశక్తి పెంపొందించేందుకు లైబ్రరరీ  పుస్తకాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

లైబ్రరరీ కార్డు నిర్వహించాలని సూచించారు. అనంతరం విద్యారులతో కలిసి భోజనం చేసి, వంటలు బావున్నాయని వంటవాళ్ళను అభినందించారు..ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, తహసీల్దార్ వసంత రావు, ఎంపిడిఓ జయశ్రీ,  ఎంఈఓ రఘుపతి, సర్పంచ్ జంపయ్య పాల్గొన్నారు.