15 May, 2026 | 2:48 AM

ప్రభుత్వ పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరేలా కృషి చేయాలి

15-05-2026 12:19 AM

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి 

కందుకూరు, మే 14 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకుంటూ, ప్రభుత్వ పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 13వ తేదీ నుండి ప్రారంభమయిన విద్యా వారోత్సవాలలో భాగంగా గురువారం జయశంకర్ బడిబాట,పేరెంట్ టీచర్ మీటింగ్ ను రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూర్ తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుండి విద్యా వారోత్సవాలను ప్రారంభించడం జరిగిందని,అందులో భాగంగా నేడు జయశంకర్ బడిబాట, పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం జరుగుతున్నదని ఆయన తెలిపారు.ప్రైవేట్ పాఠశాలల్లో నెలకు ఒకసారి పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తారని,తమ పిల్లలు ఏవిధంగా చదువుతున్నారో ఈసమావేశల ద్వారా తెలుసుకోవడం జరుగుతుందని కలెక్టర్ సూచించారు.

అలాంటి సమావేశాలను మన ప్రభుత్వ పాఠశాలలో కూడా నిర్వహించి తల్లిదండ్రులకు వారి పిల్లలు చదువులో ఏవిధంగా రాణిస్తున్నారో తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.్రఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పని చేయడం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధనా అందించి విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చేందుకు వీలవుతుందని,అందుకు గ్రామ స్థాయి పాలకవర్గం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలలలో చేరేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే నేడు అని రంగాల్లో రాణించడం జరుగుతున్నదని తెలియజేశారు.అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు సమస్యలను ఎదుర్కొనే శక్తి అలవాడుతుందన్నారు.

సమస్యలను పరిష్కరించే అవగాహన కలుగుతుందని తెలిపారు.10వ తరగతి,ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినిలను ఈ సందర్బంగా కలెక్టర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఇక ముందు కూడా ఇదే స్పూర్తితో ఉన్నత చదువులలో రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నేదునూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విష్ణుప్రియా,ఎంపిడిఓ సరిత,తహశీల్దార్ గోపాల్,ఎమ్‌ఈఓ, విద్యార్థులు,తల్లిదండ్రులు,స్థానిక ప్రజాప్రతినిధులు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.