మేడ్చల్ రోడ్లపై నరకయాతన
- అడుగడుగునా గుంతలు, ఆపై స్పీడ్ బ్రేకర్లు
- ద్విచక్ర వాహనదారులకు ఒళ్ళు నొప్పులు
- నిధులు లేక మరమ్మతులు చేయని అధికారులు
- నిధులు తీసుకురావడంలో అధికార పార్టీ నేతల వైఫల్యం
మేడ్చల్ అర్బన్, మే 14 (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఒకటి, రెండు రోడ్లు మినహా మిగతావన్నీ గుంతల మయమయ్యాయి. వర్షాకాలంలో కురిసిన వర్షాలకు రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. అవి మరమ్మత్తులు చేయకపోవడంతో ప్రమాదకరంగా తయారయ్యాయి. వర్షాకాలం ముగిసినప్పటి నుంచి తట్టెడు మట్టి వేయలేదు. పట్టణంలో కేఎల్‌ఆర్ కాలనీ వెళ్లే రోడ్డు మరి దారుణంగా తయారయింది. డిపో నుంచి శివాజీ విగ్రహం వరకు మొత్తం చెడిపోయింది.
రోడ్డుమీద గుంతలే కాకుండా 10 వరకు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. గుంతలు, స్పీడ్ బ్రేకర్లతో ఆ దారి గుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అంతేగాక ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. కోర్టు నుంచి వెళ్లే రోడ్డు కూడా ఇలాగే ఉంది. వివిధ అవసరాల కోసం రోడ్డును తవ్వి మళ్ళీ మరమ్మతు చేయకుండా అలాగే వదిలేస్తున్నారు. మళ్లీ రోడ్డుకు సమానంగా సిమెంటు వేయకపోవడంతో కాలువగా ఏర్పడ్డాయి. వీటి వల్ల కూడా ఇబ్బంది అవుతోంది.
అడుగడుగునా స్పీడ్ బ్రేకర్లు
పట్టణంలో అడుగడుగున స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరి ఇంటి ముందు వారు మున్సిపల్ అనుమతి లేకుండా స్పీడ్ బ్రేకర్లు వేసుకున్నారు. కొన్నిచోట్ల ఇష్టానుసారంగా ఎత్తుగా వేయడం వల్ల ద్విచక్ర వాహనదారులు కింద పడిపోతున్నారు. కొందరు పార్కింగ్ కోసం ఇంటి ముందు రోడ్డు సగం వరకు స్పీడ్ బ్రేకర్ నిర్మించారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు
పట్టణంలో రోడ్లు అధ్వానంగా తయారైనందున కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలు పట్టణ సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. పట్టణ కాంగ్రెస్ నాయకులు తమ నాయకులకు సమస్యలు విన్నవిస్తున్న వారు సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం లేదు. వారి సొంత ప్రాంతాలకు మాత్రం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమ ప్రాంతంలోనే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి నిధులు మళ్ళిస్తున్నారు.
అంతేగాక మున్సిపల్ కార్పొరేషన్ దృష్టిలో పెట్టుకుని అటువైపే ప్రాధాన్యం ఇస్తున్నారు. మేడ్చల్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నందున ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గానికి ఖర్చు చేయాల్సిన నిధులు తాము పోటీ చేసే ప్రాంతాల్లోనే ఖర్చు చేస్తున్నారు. దీనిపై మేడ్చల్ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ పట్టణానికి మంజూరు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.






