23 May, 2026 | 4:03 AM

జనగణనను పక్కాగా నిబంధనల ప్రకారం పూర్తి చేయాలి

23-05-2026 01:58 AM

టేకులపల్లి, మే 22,(విజయక్రాంతి): టేకులపల్లి తహసిల్దార్,  చార్జ్ ఆఫీసర్ ఎల్. వీరభద్రం శుక్రవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో జనగణన-2027 సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గత రెండు వారాలుగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న జనగణన ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఎదురవుతున్న లోటుపాట్లు, క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటికి తగిన పరిష్కార మార్గాలను చూపెట్టారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి మండలంలో జనగణన కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు తహసిల్దార్ పలు కీలక సూచనలు, నియమ నిబంధనలను జారీ చేశారు. ప్రతి ఎన్యుమరేటర్ తమకు కేటాయించిన ఇళ్లను తప్పనిసరిగా సందర్శించాలని, నిర్దేశిత నిబంధనల ప్రకారమే సర్వే సాగాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన 34 ప్రశ్నలకు ఇంటి సభ్యుల నుంచి నేరుగా సమాధానాలు సేకరించాలి.

ఎలాంటి ఊహాజనిత సమాచారానికి తావులేకుండా, నిజమైన వివరాలను మాత్రమే మొబైల్ యాప్లో నమోదు చేయాలన్నారు. డేటా నమోదులో ఎలాంటి తప్పులు దొర్లకూడదని, ప్రతిరోజు సాయంత్రం 4:00 గంటలకల్లా ఎన్ని ఇళ్లను సర్వే చేశారనే నివేదికను (రిపోర్టు) తప్పనిసరిగా తహసిల్దార్ కార్యాలయానికి సమర్పించాలని గడువు విధించారు.   ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ జనగణన విధులను ఎలాంటి అలసత్వం వహించకుండా, పారదర్శకంగా పూర్తి చేసి మండల కీర్తిని చాటాలని సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లను ఆయన కోరారు.