దశాబ్దాలు గడుస్తున్నా.... పేదల బతుకులు దమనీయమేనా?
డంపింగ్ యార్డ్ దుర్వాసనతో... ప్రజలు అంతుచిక్కని రోగాలతో సతమతం
క్రాంతి కళాబృందం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటాచారి
జవహర్ నగర్,(విజయక్రాంతి): దశాబ్దాలు గడుస్తున్నా? జవహర్ నగర్ పేదల బతుకులు... దమనీయంగా తయారయ్యాయని జవహర్ నగర్ లో పేదలు రెక్కాడితే గాని... డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారని, నోటరీ స్థలాల్లో ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ కావాలా..? ఇంకెన్ని రోజులు ఈ పేదల జీవితాలు ఇక మారవా..? అంటూ క్రాంతి కళాబృందం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటాచారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో దశాబ్దాలు గడుస్తున్నా పేదలు బతుకులు ధమనీయమేనా..? అంటూ క్రాంతి కళాబృందం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటాచారి ఆధ్వర్యంలో బుధవారం ప్రజాసంఘాల సమక్షంలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటాచారి మాట్లాడుతూ గ్రామపంచాయతీ నుండి జిహెచ్ఎంసికి మారినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వేసిన చందంగా మౌలిక వసతులు లేక ప్రజలు కడు దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు.
డంపింగ్ దుర్వాసనతో ప్రజలు అంతుచిక్కని రోగాలతో సతమతమవుతున్నారని భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని అన్నారు. ప్రతి కాలనీలో బెల్ట్ షాపులు బార్ల లాగా తెరుచుకుంటున్నాయని, యువత గంజాయి మత్తులో తిరుగుతున్నారని, జవహర్ నగర్ ను పట్టించుకున్న నాధుడే లేడా అంటూ విమర్శించారు. అనంతరం ప్రజాసంఘాల సమక్షంలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, షేక్షావలి ,శ్రీనివాస్, దేవేందర్, నరసింహులు, సురేష్, శ్రావణ్, ఆంజనేయులు, మాధవి, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




