22 July, 2026 | 3:13 AM

గ్రీన్ సిటీలో డ్రైనేజీ అవస్థలు

22-07-2026 12:54 AM

మురుగు, దోమలతో నరకయాతన

చేవెళ్ల, జూలై 21 (విజయక్రాంతి): చేవెళ్ళ మున్సిపాలిటీలోని 13వ వార్డు గ్రీన్ సిటీ కాలనీ నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలోని చంద్రరెడ్డి నగర్, సాయికృష్ణ నగర్, సన్సిటీ, వీరభద్ర కాలనీ, కృష్ణానగర్ ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు నేరుగా గ్రీన్ సిటీ కాలనీలోకి వస్తుండటంతో ఓపెన్ నాలాగా మారింది. ఇళ్ల పక్క నే మురుగు నీరు నిలిచిపోవడంతో కాలనీ అంతటా కంపు కొడుతోంది. మురుగు నీటి వల్ల దోమలు పెరిగిపోయి రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.

పందుల సంచారం తో బయట తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాలనీలోకి సరిగా వెళ్లేందుకు కనీసం రహదారి సౌకర్యం కూడా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. సొంతింటి కల నెరవేర్చుకున్నాం కానీ, ఇక్కడ ఉండలేకపోతున్నాం. సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే వార్డు కౌన్సిలర్, మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యా దు చేశాం కానీ స్పందన లేదనివెంకట్ రెడ్డి, శ్రీనివాస్ చారి, విట్టల్ రెడ్డి కాలనీ వాసులు ఆవేద న వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా తక్షణమే స్పందించి, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి తమను ఈ నరకయాతన నుంచి కాపాడాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.