డీపీఆర్‌ఓ సేవలు అభినందనీయం
- టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్
కుమురం భీం ఆసిఫాబాద్, జూలై 8 (విజయక్రాంతి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (డిపిఆర్‌ఓ) సంపత్ కుమార్ జర్నలిస్టులకు అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ కొనియాడారు.
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆసిఫాబాద్ జిల్లా నుంచి డిపిఆర్‌ఓ సంపత్ కుమార్ ఎంపికై హాజరైన సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో డిపిఆర్‌ఓ కార్యాలయంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ మారుమూల వెనుకబడిన జిల్లా నుండి కేంద్ర ఎన్నికల సంఘం సదస్సుకు సంపత్ కుమార్ హాజరు కావడం జిల్లాకే ఎంతో గర్వకారణమన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం డిపిఆర్‌ఓ నిరంతరం శ్రమిస్తున్నారని, అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చొరవ చూపుతున్నారని ప్రశంసించారు. ప్రభుత్వానికి, పాలకులకు జర్నలిస్టులకు మధ్య వారధిగా ఉంటూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వేగంగా చేరవేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్. వేణుగోపాల్, టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి దేవునూరి రమేష్, ప్రెస్ క్లబ్ కోశాధికారి శ్రీధర్, జిల్లా నాయకులు నగరారే తారు, సురేష్ చారి, రాధాకృష్ణ చారి, రాజు, జానకిరామ్, నితీష్, మోహన్ , నరేష్ తదితరులు పాల్గొన్నారు.






