అనాథ చిన్నారులకు దాతల అభయం
10 వేల రూపాయల ఆర్థిక సాయం, దుస్తుల పంపిణీ
సూర్యాపేట రూరల్, ఆగస్టు 16: ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపాడు శివారు కొత్త తండాకు చెందిన ఇద్దరు చిన్నారులకు దాతలు వారి అవసరాల నిమిత్తం 10 వేల రూపాయలు మరియు నూతన దుస్తువులు అందచేశారు. వివరాల్లోకి వెళ్తే పాతర్లపాడు శివారు కొత్త తండాకు చెందిన అభిరామ్ (8వ తరగతి), అక్షయ్ (5వ తరగతి)ల తండ్రి రమేష్ ఎనిమిదేళ్ల క్రితం, తల్లి మాధవి ఇటీవలే మృతి చెందడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
స్థానిక ఉపాధ్యాయుల ద్వారా విషయం తెలుసుకున్న సూర్యాపేటకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు గుండా రమేష్ మరియు వారి మిత్రులు యామా ప్రభాకర్, సోమ వెంకటేశ్వర్లు, ఉప్పల గురునాథం, వీర్లపాటి వెంకటేశ్వర్లు, కర్నాటి బ్రదర్స్, నూనె యుగంధర్ మానవత్వంతో ముందుకు వచ్చారు. పిల్లల తక్షణ అవసరాల కోసం 10,000 నగదు, నూతన దుస్తులను సర్పంచ్ పాండు నాయక్, గ్రామస్తుడు లింగ నాయక్, చిన్నారుల అమ్మమ్మ సమక్షంలో అందజేశారు. సాయం పొందిన చిన్నారులు దాతలకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.






